ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్.
పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 28: పోలియో నిర్మూలన లక్ష్య సాధనలో భాగంగా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఆదివారం పాల్వంచ మండలం ఇందిరానగర్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించకుండా మిగిలిపోకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.