మైనింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి.
భూపాలపల్లి ఏరియా జీఎంకు ఐఎన్టీయూసీ మెమోరాండం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 8:సింగరేణి మైనింగ్ స్టాఫ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డికి బుధవారం మెమోరాండం సమర్పించారు. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, జేబీసీసీఐ-11 స్టాండర్డైజేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ బి. జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ భూపాలపల్లి ఏరియా బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్ రెడ్డి మాట్లాడుతూ, 2016, 2017 బ్యాచ్‌లకు చెందిన సీనియర్ మైనింగ్ సర్దార్లు (ఓఎంహెచ్) కేడర్ స్కీమ్ ప్రకారం మూడేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత ఓవర్‌మన్ గ్రేడ్-బీ హోదాకు అర్హులైనా, “ఖాళీలు లేవు” అనే కారణంతో ప్రమోషన్లు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ప్రమోషన్ ఇవ్వకుండా ఓవర్‌మన్ విధులు నిర్వహింపజేయడం వల్ల అర్హులైన ఉద్యోగులకు మూడేళ్లుగా పదోన్నతులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. అండర్‌గ్రౌండ్‌లో అనారోగ్యంతో విధులు నిర్వహించలేని మైనింగ్ స్టాఫ్‌కు సర్ఫేస్‌లో అనువైన ఉద్యోగాలు కల్పించాలని, సెకండ్ క్లాస్ సర్టిఫికెట్ పొందిన మైనింగ్ స్టాఫ్‌కు కోల్ ఇండియా తరహాలో అండర్ మేనేజర్ ప్రమోషన్లు ఇవ్వాలని, అన్ని ఏరియాల్లోని అండర్‌గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఖాళీగా ఉన్న మైనింగ్ స్టాఫ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ ఎక్స్ప్లోడర్లు, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లపై పూర్తిస్థాయి శిక్షణ, అవగాహన కల్పించే వరకు అండర్‌గ్రౌండ్‌లో జరిగే ప్రమాదాలకు మైనింగ్ స్టాఫ్‌ను బాధ్యులను చేయరాదన్నారు. అలాగే ఓవర్‌మన్ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, లేదంటే జూలై 22 నుంచి మొదటి షిఫ్ట్ నుంచి సీనియర్ మైనింగ్ సర్దార్లు తమ ఆఫీస్ ఆర్డర్లో పేర్కొన్న విధంగా మైనింగ్ సర్దార్ విధులు మాత్రమే నిర్వహిస్తామని హెచ్చరించారు. మైనింగ్ స్టాఫ్ కేడర్ స్కీమ్‌లో ఉన్న లోపాలను కూడా సరిదిద్దాలని కోరారు. మెమోరాండం సమర్పించిన వారిలో ఐఎన్టీయూసీ సెంట్రల్ ఉపాధ్యక్షుడు రఘుపతి రెడ్డి, సెంట్రల్ కార్యదర్శి నరెడ్ల సంపత్, ఏరియా స్ట్రక్చర్ కమిటీ నాయకుడు షేక్ హుస్సేన్, ఎస్సీఎంఎల్యూ-ఐఎన్టీయూసీ మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి గడిపే చక్రపాణి, కేటీకే-5 ఇంక్లైన్ వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్ గుర్రం మహేందర్, కేటీకే ఓసీ-2 వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్ బాగోదుల కుమారస్వామి, కేటీకే ఓసీ-3 ప్రాజెక్ట్ వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్ (మెకానికల్) క్రాంతికుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు షేక్ హుస్సేన్, కరుణాకర్, రామ్‌కుమార్, ప్రశాంత్, కేటీకే-8 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ సంగం శ్రీనివాస్, కేటీకే-1 ఇంక్లైన్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ భారత్ శ్రీనివాస్, కేటీకే-5 ఇంక్లైన్ ఐఎన్టీయూసీ మహిళా విభాగానికి చెందిన సోనీ, దివ్య, సంగీత, దివ్యశ్రీతో పాటు పలువురు నాయకులు, మైనింగ్ స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు.