ఘనంగా డా. జనక్ ప్రసాద్ 74వ జన్మదిన వేడుకలు.
కార్మిక సంక్షేమానికి ఆయన సేవలు అపారం: కార్మిక నాయకులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 13: ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ డాక్టర్ జనక్ ప్రసాద్ 74వ జన్మదిన వేడుకలు గురువారం గోదావరిఖనిలోని జనక్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ కచ్చకాయల సదానందం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు పలువురు కార్మిక నాయకులు, అభిమానులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరై డాక్టర్ జనక్ ప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భూపాలపల్లి నుంచి హాజరైన సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జోగ బుచ్చయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ యాదవ్, నాయకులు బండి శ్రీనివాస్, బండి వెంకటేశ్వర్లు తదితరులు డాక్టర్ జనక్ ప్రసాద్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం డాక్టర్ జనక్ ప్రసాద్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని నాయకులు కొనియాడారు. ముఖ్యంగా నల్లసూర్యుల శ్రేయస్సు, కార్మికుల కనీస వేతనాలు, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషి కార్మిక వర్గానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. డాక్టర్ జనక్ ప్రసాద్ ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజా, కార్మిక సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.