Take a fresh look at your lifestyle.

సింగరేణిలో ఇకపై ‘మజ్దూర్’ పదానికి వీడ్కోలు.

0 24

సింగరేణిలో ఇకపై ‘మజ్దూర్’ పదానికి వీడ్కోలు.
9 ఉద్యోగ హోదాల్లో ‘మజ్దూర్’ స్థానంలో ‘అసిస్టెంట్’ – యాజమాన్యం ఉత్తర్వులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 9:సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌)లో ఇకపై పలు ఉద్యోగ హోదాల్లో “మజ్దూర్” అనే పదం కనుమరుగు కానుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన సింగరేణి యాజమాన్యం, తొమ్మిది ఉద్యోగ హోదాల్లో “మజ్దూర్” స్థానంలో “అసిస్టెంట్” అనే పదాన్ని ప్రతిష్ఠిస్తూ గురువారం అధికారిక సర్క్యులర్‌ను జారీ చేసింది. కార్పొరేట్ పర్సనల్ విభాగం ఇండస్ట్రియల్ రిలేషన్స్ వింగ్ విడుదల చేసిన సర్క్యులర్ (రిఫరెన్స్ నెం. సీఆర్పీ/పిఇఆర్/ఐఆర్/సి/081/679, తేదీ: 09-07-2026) ప్రకారం, సీఎండీ స్థాయిలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎస్‌సీడబ్ల్యూయూతో నిర్వహించిన 38వ, 39వ పీరియాడికల్ స్ట్రక్చర్డ్ సమావేశాల్లో చేసిన ప్రతిపాదనకు సమర్థ అధికారి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం బంకర్ చైన్ మజ్దూర్, క్లే పిల్ మజ్దూర్, ల్యాంప్ మజ్దూర్, శాంప్లింగ్ మజ్దూర్, స్టోర్స్ ఇష్యూ మజ్దూర్, సర్వే మజ్దూర్, టబ్ రిపేర్/మేకింగ్ మజ్దూర్, టబ్ రిపేరింగ్ మజ్దూర్, వ్యాగన్ లోడ్ అండ్ షంటింగ్ మజ్దూర్ హోదాలను వరుసగా బంకర్ చైన్ అసిస్టెంట్, క్లే పిల్ అసిస్టెంట్, ల్యాంప్ అసిస్టెంట్, శాంప్లింగ్ అసిస్టెంట్, స్టోర్స్ ఇష్యూ అసిస్టెంట్, సర్వే అసిస్టెంట్, టబ్ రిపేర్/మేకింగ్ అసిస్టెంట్, టబ్ రిపేరింగ్ అసిస్టెంట్, వ్యాగన్ లోడ్ అండ్ షంటింగ్ అసిస్టెంట్‌గా మార్చారు. అయితే ఈ మార్పు కేవలం ఉద్యోగ హోదా పేరుకు మాత్రమే పరిమితమని, ఉద్యోగుల విధులు, సేవా నిబంధనలు లేదా ఇతర హక్కుల్లో ఎలాంటి మార్పు ఉండదని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, సంబంధిత అన్ని గనులు, విభాగాలు అవసరమైన చర్యలు చేపట్టాలని యాజమాన్యం ఆదేశించింది. ఇప్పటికే సంస్థలో అధిక సంఖ్యలో ఉన్న జనరల్ మజ్దూర్ల హోదాను “జనరల్ అసిస్టెంట్”గా మార్చిన నిర్ణయాన్ని అమలు చేసిన సింగరేణి యాజమాన్యం, ఇప్పుడు మరో తొమ్మిది డిజిగ్నేషన్లలోనూ అదే విధానాన్ని అమలు చేసింది. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు, వారి హోదాలకు మరింత గౌరవప్రదమైన గుర్తింపు కల్పించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమం, గౌరవానికి యాజమాన్యం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Leave A Reply

Your email address will not be published.