Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ ఖాతాలోని రూ.1,400 కోట్లు అమరవీరుల కుటుంబాలకు పంచాలి : కల్వకుంట్ల కవిత.

0 20

బీఆర్ఎస్ ఖాతాలోని రూ.1,400 కోట్లు అమరవీరుల కుటుంబాలకు పంచాలి.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై కవిత ఘాటు విమర్శలు.
“నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌లో చేరను”
సింగరేణి సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం.
తాడిచర్ల–2తో పాటు మిగిలిన 16 బొగ్గు గనులను కూడా సింగరేణికే కేటాయించాలి.

సింగరేణి కార్మికులకు నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలి.

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో రైతులకు అన్యాయం జరుగుతోంది. 

ప్రజా సమస్యలపై పోరాటాలే తమ పార్టీ ప్రధాన అజెండా.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 9:బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్లను అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పంపిణీ చేయాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఖాతాలోని నిధులు క్విడ్ ప్రో కో ద్వారా సమకూరినవేనని ఆరోపించిన ఆమె, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు ఆ డబ్బును ఇవ్వాలని సూచించారు. కోల్‌బెల్ట్ పర్యటనలో భాగంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సింగరేణి బొగ్గు గనులను సందర్శించిన కవిత, కార్మికులతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను మళ్లీ బీఆర్ఎస్‌లో చేరబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీలోకి తిరిగి వెళ్లబోనని స్పష్టం చేశారు. తమ పార్టీ పేరు ప్రజల్లోకి రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, టీఆర్ఎస్ పేరును ఈసీ వద్ద అడ్డుకునేందుకు వెయ్యికి పైగా ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై తాము చేస్తున్న పోరాటాలను ప్రజల్లోకి వెళ్లనీయకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు కలిసి వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్‌కు నీతి, నియమం ఏమీ లేకుండా పోయాయని, సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయించడం సిగ్గుచేటని అన్నారు. “తల్లి, చెల్లి అనే ఇంగితం లేకుండా దూషిస్తే ఊరుకోం. ఇది ఆంధ్రా కాదు.. కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతాం” అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలకు ఘాటుగా హెచ్చరించారు. కేటీఆర్ తన సన్నిహితులకు క్విడ్ ప్రో కో ద్వారా అక్రమ అనుమతులు ఇచ్చారని, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌కు లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. రూ.188 కోట్లతో ‘పయనీర్’ ఇంగ్లీష్ పత్రికను కొనుగోలు చేసి తమ పార్టీ వార్తలు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. హరీశ్‌రావు కాళేశ్వరం అవినీతికి ప్రతీకగా మారారని, అలాంటి నాయకుడినే ముందుకు తెచ్చి బీఆర్ఎస్ భవిష్యత్తును తానే నాశనం చేసుకుంటోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం అంశాన్ని రాజకీయాల కోసం వాడుకుంటూ రైతులను మోసం చేస్తోందని, ముఖ్యమంత్రికి నీటి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదన్నారు. అర కిలోమీటరు రాళ్ల కట్ట నిర్మిస్తే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, గత ప్రభుత్వంపై కక్షతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రైతు భరోసాను విడతల వారీగా ఇవ్వడం, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి కొన్ని రకాలకే పరిమితం చేయడం రైతులను మోసం చేయడమేనన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన రైతులు, మహిళలపై కేసులు, రౌడీషీట్లు నమోదు చేయడాన్ని ఖండించారు. ఖమ్మంలో రైతు సభ నిర్వహించే ముందు ఆ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి సమస్యలపై కూడా కవిత విస్తృతంగా స్పందించారు. సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.54 వేల కోట్లు చెల్లించకపోవడం వల్లే సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడిందన్నారు. కార్మికులకు అవసరమైన పనిముట్లు, భద్రతా సామగ్రి కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో అధికారులు, కార్మికులకు వేర్వేరు నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో ఓపెన్‌కాస్ట్, అండర్‌గ్రౌండ్ గనుల సమతుల్యత ఉండాలని, అదే సంస్థ భవిష్యత్తుకు మేలు చేస్తుందన్నారు. నిజాం కాలంలో సింగరేణికి కేటాయించిన 17 బొగ్గు గనుల్లో ఇప్పటివరకు ఒక తాడిచర్ల-2 గనినే కేంద్రం కేటాయించిందని, మిగిలిన 16 గనులను కూడా ఎలాంటి టెండర్లు లేకుండా సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడిచర్ల-2 గనిని పూర్తిగా సింగరేణే నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని, ప్రైవేట్ సంస్థలకు ఇస్తే స్థానికులకు ఉద్యోగాలు దక్కవని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తాడిచర్ల-1 గనిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. ఒకప్పుడు 62 వేల మంది ఉద్యోగులు ఉన్న సింగరేణిలో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 38 వేలకు పడిపోయిందని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించి పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని, ఆ తర్వాత నెలకు ఒకసారి బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే తాను నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. అలియాస్ పేర్ల సమస్య, పదో తరగతి అర్హత పేరుతో జరుగుతున్న ఇబ్బందులను కూడా వెంటనే పరిష్కరించాలని కోరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సింగరేణి కార్మికుల సమస్యలపై స్పందించడం లేదని విమర్శించిన కవిత, కేంద్రం 25 కార్మిక చట్టాలను నాలుగుకు కుదించడం వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ఆ చట్టాలను తెలంగాణలో అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటమే తమ పార్టీ లక్ష్యమని, పదవుల కోసం కాదని కవిత స్పష్టం చేశారు. కేవలం 73 రోజుల్లోనే తమ పార్టీ ప్రజల్లో బలమైన గుర్తింపు సంపాదించిందని, ఉద్యమకారులు, రైతులు, కార్మికుల హక్కుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటం కొనసాగిస్తామని ఆమె ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.