Take a fresh look at your lifestyle.

అప్పాని శ్రీనివాస్‌పై విమర్శలు ఖండనీయం: బీఎంఎస్ నాయకులు.

0 11

అప్పాని శ్రీనివాస్‌పై విమర్శలు ఖండనీయం: బీఎంఎస్ నాయకులు

తెలంగాణ ఉద్యమం, కార్మిక హక్కుల సాధనలో అప్పాని సేవలు మరువలేనివి.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 19:బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్‌పై టిబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య చేసిన విమర్శలను బీఎంఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. భూపాలపల్లిలోని బీఎంఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఎంఎస్ భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సుజేందర్, బ్రాంచ్ కార్యదర్శి రేణుకుట్ల మల్లేష్ మాట్లాడుతూ సమ్మయ్య చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బడితల సమ్మయ్యకు ఎలాంటి పాత్ర లేదని, చరిత్ర తెలుసుకోకుండా అప్పాని శ్రీనివాస్‌పై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో అప్పాని శ్రీనివాస్ సకల జనుల సమ్మె, సాగరహారం, వంటా-వార్పు వంటి ఉద్యమాల్లో ముందుండి పోరాడారని, అంబేద్కర్ సెంటర్‌లో వెయ్యి రోజులకు పైగా నిరాహార దీక్షలు నిర్వహించారని గుర్తుచేశారు. 2012లో టిబీజీకేఎస్ విజయానికి కూడా ఆయన కీలకంగా పనిచేశారని తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అప్పాని శ్రీనివాస్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కార్మికులకు డ్రెస్ కోడ్ అమలు చేయడంలో కెంగర్ల మల్లయ్యతో కలిసి కీలక పాత్ర పోషించారని చెప్పారు. అలాగే డిపెండెంట్ ఉద్యోగాల సాధన కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ‘డయల్ యువర్ సీఎం’ కార్యక్రమంలో మాట్లాడటంతో పాటు తెలంగాణ భవన్‌లో పలుమార్లు చర్చలు జరిపి కారుణ్య నియామకాలు అమలుకు కృషి చేశారని వివరించారు. జాతీయ సంఘాల వల్ల కోల్పోయిన పీఎం హక్కులను కోల్ ఇండియా స్థాయిలో పోరాడి తిరిగి సాధించడంతో పాటు, రూ.20 లక్షల మ్యాచింగ్ రేటు, క్రీడాకారులకు ఓడీ హక్కులు కూడా అప్పాని శ్రీనివాస్ కృషి ఫలితంగానే వచ్చాయని పేర్కొన్నారు. బడితల సమ్మయ్యకు కార్మిక సమస్యలపై అవగాహన లేదని, ఒక సర్క్యులర్‌కు సమాధానం రాయడం కూడా తెలియదని విమర్శించారు. అప్పాని శ్రీనివాస్ సాధించిన హక్కులను అనుభవిస్తూ ఆయనపైనే విమర్శలు చేయడం సరికాదన్నారు. భవిష్యత్తులో కూడా అప్పాని శ్రీనివాస్‌పై నిరాధార ఆరోపణలు చేస్తే కార్మికుల సమక్షంలో తగిన సమాధానం చెబుతామని బీఎంఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి కేంద్ర కమిటీ సభ్యులు పండ్రాల మల్లేష్, పొట్టి శ్రీరాములు, రాజ్ నాయక్, ఫణి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.