మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉధృతి.
లక్ష క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం.. అన్ని గేట్ల ద్వారా నీటి విడుదల.
గోదావరిలోకి వెళ్లొద్దని ప్రజలు, మత్స్యకారులకు అధికారుల హెచ్చరిక.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కాటారం, జూలై 30: ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉధృతి పెరిగి లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీకి వచ్చిన వరద నీటిని పూర్తిస్థాయిలో దిగువకు విడుదల చేస్తూ నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గురువారం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మేడిగడ్డ బ్యారేజీకి 1,01,530 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అదే మొత్తంలో 1,01,530 క్యూసెక్కుల నీటిని అవుట్‌ఫ్లో రూపంలో అన్ని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 90.40 మీటర్లుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న గంటల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వరద ఉధృతి దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు నదిలోకి వెళ్లరాదని, నది ఒడ్డున అనవసరంగా గుమిగూడవద్దని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Prev Post