
2026-27 ఉత్పత్తి లక్ష్యాలను సాధించి ఏరియాను లాభాల బాటలోకి తీసుకెళ్లాలి.
భద్రత, ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమంపై సమిష్టి కృషి అవసరం.
సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 15: 2026-27లో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి భూపాలపల్లి ఏరియాను తిరిగి లాభాల బాటలోకి తీసుకురావడమే ప్రధాన ధ్యేయమని సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. భద్రత, ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లి సింగరేణి జీఎం కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి తెలంగాణ పారిశ్రామిక ప్రగతి, విద్యుత్ ఉత్పత్తి, వేలాది కుటుంబాల జీవనోపాధికి వెన్నెముకగా నిలిచిందన్నారు. సి అండ్ ఎండి డా. బుద్ధ ప్రకాష్ జ్యోతి నాయకత్వంలో సంస్థ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతూ బొగ్గు, థర్మల్, సౌర విద్యుత్ రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు. ఒడిశాలోని నైనీ గని నుంచి 4,000 టన్నుల బొగ్గుతో 1,131 కిలోమీటర్లు ప్రయాణించిన తొలి రైల్వే రేక్ జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్కు చేరడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. తాడిచెర్ల-2 బ్లాక్లో 182 మిలియన్ టన్నుల నిల్వలు, ఏటా 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, ప్రకాశం ఖని ఓసీ-2 కేటాయింపుతో భవిష్యత్ ఉత్పత్తి, ఉపాధి అవకాశాలకు మరింత బలం చేకూరుతుందని తెలిపారు. సింగరేణి 2026-27లో 650 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 187 లక్షల టన్నుల లక్ష్యానికి 169 లక్షల టన్నులు (90 శాతం) సాధించిందన్నారు. భూపాలపల్లి ఏరియాకు 46 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యం కాగా, 10.76 లక్షల టన్నుల రవాణా లక్ష్యానికి 10.38 లక్షల టన్నులు (97 శాతం) సాధించినట్లు వివరించారు. రూ.96 కోట్ల నష్టం నమోదైన నేపథ్యంలో మిగిలిన కాలంలో లక్ష్య సాధనకు రోజుకు సగటున 14,905 టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. వర్షాల కారణంగా ఓసీ-2, ఓసీ-3ల్లో ఉత్పత్తి తగ్గిందని, పాత ఎస్డీఎల్ యంత్రాలు, ఇసుక కొరత, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల పదవీ విరమణ, గైర్హాజరు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని తెలిపారు. ఉత్పత్తి కంటే ఉద్యోగుల ప్రాణ రక్షణ, భద్రతకే అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని జీఎం స్పష్టం చేశారు. మల్టీ డిపార్ట్మెంటల్ బృందాలతో గనుల తనిఖీలు నిరంతరం జరుగుతున్నాయని, ఏరియాలో సుమారు 25 శాతం గైర్హాజరు నమోదవుతున్న నేపథ్యంలో యువ ఉద్యోగులు క్రమం తప్పకుండా విధులకు హాజరై సంస్థ ఉత్పత్తి, ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలని కోరారు. భూపాలపల్లి ఏరియాలో ఇప్పటివరకు 1,534 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామని, ఉద్యోగుల పిల్లలకు మెడికల్ కాలేజీలో 7, జేఎన్టీయూలో 36, కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో 10 సీట్లు కేటాయించామని తెలిపారు. సింగరేణి సేవా సమితి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను జీఎం సన్మానించి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్వో టు జీఎం శ్యామ్ సుందర్, ఏసీఎంవో డాక్టర్ పద్మజ, ఏజీఎం (సివిల్) రవికుమార్, ఏజీఎం (ఐఈడీ) జ్యోతి, పీవో, కేటీకే ఓసీ-3 డి. రామస్వామి, డీజీఎం (ఎఫ్అండ్ఏ) పి. రాజేశ్వర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మాటూరి రవీందర్, కేటీకే-1 గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, ఐఎన్టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బి. మధుకర్ రెడ్డి, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, సింగరేణి సేవా సమితి సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.