అనారోగ్యంతో చేనేత కార్మికుడు మృతి.
నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : చేనేత సహకార సంఘం చైర్మన్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
రేగొండ, ఆగస్టు 15: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నిరుపేద చేనేత కార్మికుడు వడ్డేపల్లి చిన్న సమ్మయ్య శనివారం ఉదయం మృతి చెందారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలం చిన్నకోడెపాక గ్రామానికి చెందిన సమ్మయ్య చేనేత వృత్తిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునేవారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చేనేత వృత్తిని కొనసాగించలేక మంచానికే పరిమితమయ్యారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటంతో మెరుగైన వైద్యం అందించలేకపోవడం వల్లే సమ్మయ్య మృతి చెందారని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సమ్మయ్య మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమ్మయ్య మృతిపై చిన్నకోడెపాక చేనేత సహకార సంఘం చైర్మన్ ఆడేపు రామనాథం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి సంపాదించే ఆధారం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, నిరుపేద కుటుంబ పరిస్థితిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని తక్షణమే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.