
ఉత్పత్తి కంటే ఉద్యోగుల భద్రతే ప్రధానం.
ప్రమాదరహిత సింగరేణి కోసం అన్ని చర్యలు. రక్షణ పెంపునకు ఆధునిక సాంకేతికత వినియోగం.
50వ త్రైపాక్షిక భద్రతా సమీక్షా సమావేశంలో సీఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతి.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబర్ 3: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కంటే ఉద్యోగుల భద్రతకే అధిక ప్రాధాన్యత ఇస్తామని సంస్థ చైర్మన్, ఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతి స్పష్టం చేశారు. ప్రమాదరహిత సింగరేణి కోసం అన్ని రకాల చర్యలు చేపడతామని, కార్మిక సంఘాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. ప్రమాదాల నివారణకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గురువారం నిర్వహించిన 50వ త్రైపాక్షిక భద్రతా సమీక్షా సమావేశంలో సీఎండీ మాట్లాడారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అధికారులు, సింగరేణి అధికారుల సంఘం, గుర్తింపు పొందిన, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, యాజమాన్య ప్రతినిధులు సమావేశంలో పాల్గొని గనుల్లో భద్రతా చర్యలు, కార్మికుల ఆరోగ్యం, వైద్య సేవలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రమాదాలపై సమగ్ర సమీక్ష:
గనుల్లో ప్రమాదాల నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు అమలవుతున్నాయి, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం అవుతున్నాయా అనే అంశాలను సమగ్రంగా పరిశీలిస్తామని సీఎండీ తెలిపారు. ప్రమాదరహిత మైనింగ్ కోసం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను గుర్తించి, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు చేసిన సూచనలపై తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రాణాపాయ ప్రమాదాలు తగ్గడం అభినందనీయం:
డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ డా. సగేష్‌కుమార్ మాట్లాడుతూ, సమావేశంలో కార్మిక సంఘాలు అనేక విలువైన సూచనలు చేశాయని తెలిపారు. భద్రత విషయంలో సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాలు నిబద్ధతతో పనిచేయడం అభినందనీయమన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ప్రాణాపాయ ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గడం సంతోషకరమని పేర్కొన్నారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో సింగరేణి ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులు కూడా ఒకే విధంగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేసే విధానాన్ని వెంటనే అమలు చేయాలని సూచించారు. సింగరేణి ఉద్యోగుల భద్రతను మరింత పెంపొందించేందుకు అవసరమైన శిక్షణ అందించడానికి డీజీఎంఎస్ తరఫున ఎల్లప్పుడూ సహకరిస్తామని తెలిపారు.
సిబ్బంది కొరత తీర్చాలని సూచన:
సమావేశంలో కార్మిక సంఘాల ప్రతినిధులు సింగరేణి వ్యాప్తంగా భద్రత, ఆరోగ్యం, వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. గనుల్లో సిబ్బంది కొరతను పరిష్కరించాలని, అవసరమైన సూపర్‌వైజర్లు, సిబ్బంది, అధికారులను నియమించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా సమగ్ర భద్రతా శిక్షణ ఇవ్వాలని, నాణ్యమైన బూట్లు, ఇతర రక్షణ పరికరాలు అందించాలని సూచించారు. గనుల్లో అవసరమైన స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆధునిక వైద్య సేవలను మరింత విస్తరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై యాజమాన్యం తరఫున తగిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.
మృత కార్మికులకు సంతాపం:
సమావేశానికి జనరల్ మేనేజర్ (సేఫ్టీ) సాయిబాబు స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికులకు సమావేశం తొలుత సంతాపం తెలిపింది. అనంతరం గత ఏడాది నిర్వహించిన త్రైపాక్షిక భద్రతా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు. సుహృద్భావ వాతావరణంలో సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) గౌతమ్ పోట్రు, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం. తిరుమలరావు, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. డీజీఎంఎస్ తరఫున డైరెక్టర్స్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ డా. సగేష్‌కుమార్, డా. ఐ. సత్యనారాయణ, రాజ్‌కుమార్, కె. మహేశ్వరరెడ్డి, పంకజ్‌కుమార్ జైన్, డిప్యూటీ డైరెక్టర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు. కార్మిక సంఘాల తరఫున గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కార్యదర్శి రాజ్‌కుమార్, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డా.జనక్ ప్రసాద్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. నరసింహారెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు తదితరులు పాల్గొన్నారు.