Take a fresh look at your lifestyle.

కార్మిక సమస్యలపై ఐక్యంగా పోరాడాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.

0 4

కార్మిక సమస్యలపై ఐక్యంగా పోరాడాలి.

గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదు: గండ్ర వెంకటరమణారెడ్డి

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 27:సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలను బలంగా ప్రశ్నించేందుకు గుర్తింపు పొందిన కార్మిక సంఘం అవసరమని, అలాంటి సంఘం ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం టీబీజీకేఎస్‌ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి బొగ్గు గని కార్మికుల సంక్షేమం కోసం గతంలో కేసీఆర్‌ నాయకత్వంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు. సింగరేణి సంస్థను పరిరక్షించడంతో పాటు కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి సమర్థంగా తీసుకెళ్లేందుకు గుర్తింపు సంఘం అవసరమని పేర్కొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు గండ్ర తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టీబీజీకేఎస్‌ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్మికులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ బలోపేతం, కార్మికుల భవిష్యత్తు భద్రతే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తోందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు, బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులు, టీబీజీకేఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.