
కట్టుదిట్టమైన భద్రత మధ్య నీట్ యూజీ–2026 పరీక్షలు.
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.
పరీక్ష ముగిసే వరకు సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:నీట్ యూజీ–2026 పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదివారం కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల, రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, అభ్యర్థుల తనిఖీ విధానం, భద్రతా చర్యలు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. పరీక్షలు పూర్తయ్యే వరకు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమల్లో ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన ఎస్పీ, ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై, నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నీట్ పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తోందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.