Take a fresh look at your lifestyle.

సింగరేణి కార్మిక సమస్యలపై 14న రామగుండంలో బీఆర్‌ఎస్ సభ : హరీష్ రావు.

0 2

సింగరేణి కార్మిక సమస్యలపై 14న రామగుండంలో బీఆర్‌ఎస్ సభ : హరీశ్‌రావు.
‘కార్మిక గర్జన’కు కేటీఆర్ హాజరు.. లాభాల్లో వాటా, డిపెండెంట్ ఉద్యోగాలు, ఎన్నికలు నిర్వహించాలి.  
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, అక్టోబర్ 8: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14న రామగుండంలో సాయంత్రం 5 గంటలకు ‘సింగరేణి కార్మిక గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. గురువారం తెలంగాణ భవన్‌లో టీజీబీకేఎస్ నాయకులు, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జులు, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, టీజీబీకేఎస్ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ఎంపీ రవన్న, ఎమ్మెల్యే కోవ లక్ష్మి తదితరులతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు పూర్తి వాటా ప్రకటించాలని, డిపెండెంట్ ఉద్యోగాల కోసం నెలకు మూడు మెడికల్ బోర్డులు నిర్వహించి అర్హులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, గడువు ముగిసిన సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ప్రతి కార్మికుడికి 250 గజాల ఇంటి స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణం ఇవ్వాలని కోరారు. బీఆర్‌ఎస్ హయాంలో 2022-23లో సింగరేణి లాభాల్లో 32 శాతం కార్మికులకు వాటాగా ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం 2023-24లో 16 శాతం, 2024-25లో 12.5 శాతం మాత్రమే ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. 2022-23లో రూ.2,222 కోట్లు, 2023-24లో రూ.4,712 కోట్లు, 2024-25లో రూ.6,394 కోట్ల లాభాలు వచ్చినట్లు తెలిపారు. 2025-26 లాభాలను ఇప్పటివరకు ప్రకటించలేదని, ఈ ఏడాది లాభాలు రూ.1,800 కోట్లకు మించవన్న సమాచారం తమకు ఉందని పేర్కొన్నారు. అయితే ఈ గణాంకాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తి కూడా తగ్గిందని హరీశ్‌రావు ఆరోపించారు. 2021-22లో 65 మిలియన్ టన్నులు, 2022-23లో 67 మిలియన్ టన్నులు, 2023-24లో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉండగా, 2024-25లో 69, 2025-26లో 58 మిలియన్ టన్నులకు తగ్గిందన్నారు. అదే సమయంలో అవుట్‌పుట్‌ ఫర్‌ మ్యాన్‌షిఫ్ట్‌ 6.39 టన్నుల నుంచి 7.56 టన్నులకు పెరిగిందని, కార్మికుల పనితీరు మెరుగుపడినప్పటికీ యాజమాన్య నిర్ణయాల వల్ల ఉత్పత్తి తగ్గిందని ఆరోపించారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం, జెన్‌కో నుంచి బకాయిలు పెరిగాయని, మొత్తం బకాయిలు రూ.50 వేల కోట్లకు చేరినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల కోసం రూ.6,323 కోట్లు బ్యాంకుల్లో ఉంచినట్లు ప్రభుత్వం చెబుతుండగా, సింగరేణి రూ.4 వేల కోట్ల ఓడీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలను అడ్డుకుంటామని అన్నారు. జీవో 76ను కేసీఆర్ ప్రభుత్వం 2019లో జారీ చేసిందని, సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న కార్మికులకు ఇళ్లపై హక్కులు కల్పించేందుకు సుమారు 30 వేల ఇళ్లకు పట్టాలు ఇచ్చినట్లు హరీశ్‌రావు తెలిపారు. మిగిలిన అర్హులందరికీ రిజిస్టర్డ్ సేల్‌డీడ్ ద్వారా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కొత్త బొగ్గు గనులను నామినేషన్ ప్రాతిపదికన కేటాయించాలని, సింగరేణి ప్రాంతానికే సీఎస్‌ఆర్ నిధులు వినియోగించాలని కోరారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 14న జరిగే సభకు అన్ని బొగ్గు గనుల కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.