కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా CPI(ML) ప్రజాపంథా విప్లవ నివాళి
నిజామాబాద్ అర్బన్, జనవరి 21 ( లోకం తీరు ) : మహోపాధ్యాయుడు, రష్యా విప్లవ నిర్మాత కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి సందర్భంగా CPI(ML) ప్రజాపంథా నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో కామ్రేడ్ లెనిన్ చిత్రపటానికి పూలమాలలతో విప్లవ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా CPI(ML) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ నాయకుడు, కార్యకర్త, ఆర్గనైజర్, ఉపాధ్యాయుడు, ఉపన్యాసకుడు, నిర్మాణశిల్పి, సిద్ధాంతవేత్త, వ్యూహకర్త, ఎత్తుగడల రూపకర్త, అన్నింటి కన్నా మహోన్నత మానవుడు అని కొనియాడారు. ప్రస్తుతం మనదేశంలో మతోన్మాదం, సామ్రాజ్యవాదం పెనవేసుకొని దోపిడీ, పీడనా కొనసాగిస్తున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల్ని మతం మత్తులో ముంచి ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను కార్పోరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యవస్థ మున్నెన్నడూ లేనంత తీవ్ర సంక్షోభంలో వున్నదన్నారు. లెనిన్ ఆచరణలో నిరూపించిన విప్లవాచరణ, విప్లవ నిర్మాణం అవసరమన్నారు. ముఖ్యంగా నిర్దిష్ట పరిస్థితులకు నిర్ధిష్ట వైఖరిని చేపట్టడం అవసరమన్నారు. సామ్రాజ్యవాదం, మతోన్మాదాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కామ్రేడ్ లెనిన్ కి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో CPI(ML) ప్రజాపంథా నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న, సహాయ కార్యదర్శి సిహెచ్ సాయగౌడ్, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఆల్గోట్ రవీందర్, POW జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేష్, IFTU జిల్లా నాయకులు డి.కిషన్, బి.మురళి, టి.విటల్, బి.లింగం, డి.కిరణ్, PYL జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా వివిధ ప్రజాసంఘాల నాయకులు నర్సక్క, తారాచంద్, రమేష్, మహిపాల్, మహేష్, అరవింద్, నర్సయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
