బాల్కొండ క్యాంప్ కార్యాలయం లో జండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
- రాజ్యాంగ చట్రంలో రాజ్యాంగేతర శక్తులు దూరొద్దు..
- ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇకనైనా రాజ్యాంగ స్పూర్తికి లోబడి పనిచేసుకోవాలి..
- – అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు హితవు పలికిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి..

బాల్కొండ , జనవరి 26 ( లోకం తీరు ) : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్పూర్తికి లోబడి ప్రతీ ఒక్కరు పనిచేయాలని, రాజ్యాంగ చట్రంలో కొందరు రాజ్యాంగేతర శక్తులు దూరి ఈ స్పూర్తిని చెడగొడుతున్నాయని, ఇకనైనా వారి తీరు మార్చుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హితవు పలికారు. శుక్రవారం బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకులకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వతంత్ర భారతావనిలో భారతరాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇదని, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచించిన రాజ్యాంగం బడుగు బలహీన వర్గాల ప్రజలకు, అట్టడుగు ప్రజలకు కులమతాలకు అతీతంగా అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలని లిఖించడబడ్డదే ఈ రాజ్యంగమని వివరించారు. ఘనంగా భారత్ మొత్తం వేడుకగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్పూర్తి సక్రమంగా అమలు చేయబడాలని పిలుపునిచ్చారు. బారతదేశంలోని ప్రతీ ఒక్క పౌరుడికి సమాన హక్కులుండాలుండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. బాల్కొండలో కూడా రాజ్యాంగ స్పూర్తి అమలు కావాలన్నారు. ‘ఎవరి అధికారాలు వారికుండాలె. రాజ్యాంగేతర శక్తులు అధికారుల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇది మంచి పద్దతి కాదు. అధికారులకు, రాజ్యాంగేతర శక్తులకు పిలుపునిస్తున్నా. ఇది మంచి పద్దతి కాదు. అధికారులను వాళ్ల పనులను వాళ్లు చేసుకునేలా చూడాలి. ప్రజలచే గెలిచిన ప్రజాప్రతినిదులు వాళ్ల పనులు చేసుకునే క్రమంలో ఎవరూ అడ్డుకోరాదు.’ అని ప్రశాంత్‌రెడ్డి హితవు పలికారు. రాజ్యాంగాన్ని స్పూర్తిగా తీసుకుని బాల్కొండ నియోజకవర్గంలో, నిజామాబాద్ జిల్లాలో, రాష్ట్రంలో అదికారులంతా రాజ్యాంగానికి లోబడి వారి వారి విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ రాజ్యంగ చట్రంలో రాజ్యాంగేతర శక్తులు దూరొద్దన్నారు. రాజ్యాంగానికి, సమాజానికి ఇది మంచిదికాదన్నారు. కొత్తలో ఏదో తెలియక చేసిండొచ్చు గానీ, రేపటి నుంచి ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించారు. ఎవరికి వారు రాజ్యాంగ బద్దంగా విధులు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు వేముల.
ఈ కార్యక్రమంలో నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,పాఠశాల చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..