Take a fresh look at your lifestyle.

రాజకీయాలకు రాచబాట….కటాలిన్ నోవాక్ రాజీనామా

0 1,639

రాజకీయాలకు రాచబాట …కటాలిన్ నోవాక్ రాజీనామా

  • జె.జె.సి.పి.బాబూరావు రీసెర్చ్ స్కాలర్ సేకరణ

కామారెడ్డి జిల్లా రామారెడ్డి , ఫిబ్రవరి 14  ( లోకంతీరు ) : చిల్డ్రన్‌ హోం నిర్వాహకులు పిల్లలను లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని కప్పిపుచ్చిన సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ను కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించిన వ్యక్తికి హాంగేరీ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ క్షమాభిక్షను ప్రసాదించడంపై యావత్ దేశ ప్రజానీకాన్ని తీవ్ర అగ్రహావేశాలకు గురిచేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దశాబ్దానికి పైగా హంగేరియన్ రాజకీయ రంగంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సంప్రదాయవాద ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్‌కు సన్నిహిత మిత్రురాలు అయిన హాంగరీ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ ఆ రకంగా క్షమాభిక్షను ప్రసాదించడంపై ప్రజలు ఏకంగా అధ్యక్షురాలి భవనం ముందే నిరసన జ్వాలలు రగిలించారు. ఈ వివాదం కుటుంబ – స్నేహపూర్వక విధానాలపై ప్రచారం చేసిన హంగేరీ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్‌కు సవాలుగా మారి రాజకీయ విపరిణామాలను తెచ్చిపెట్టిన దరిమిలా అంతిమంగా అధ్యక్షురాలు తన పదవిని కోల్పోవడం ‘ప్రజాశక్తి విజయం’గా అభివర్ణించవచ్చు. ఈ రకంగా ఓర్బన్ ప్రభుత్వం దేశ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ క్షమాపణపై ప్రజల ఎదురుదెబ్బను ఎదుర్కొన్నందున రాజకీయ నష్టాన్ని అరికట్టే దిశలో భాగంగా జూన్‌లో జరిగే యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఫిడెజ్ పార్టీ ఇకమీదట ‘బాలలపై నేరాలకు పాల్పడిన వ్యక్తులను క్షమింపజేసే అధికారాలను అధ్యక్షుడికి కల్పించకూడదు’ అనే రాజ్యాంగ సవరణను పార్లమెంటుకు సమర్పించడాన్ని సృష్టంగా గమనించవచ్చు.

ఫ్రాన్సిస్ హంగేరీ పర్యటనలో భాగంగా..!

గత సంవత్సరం ఏప్రిల్‌ నెలలో హాంగరీ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ చేత క్షమాభిక్ష ప్రసాదింపబడిన 25 మంది పేర్లు హంగేరియన్ మీడియా ద్వారా వెలుగులోకి రావడాన్ని గమనించవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బాలల గృహంలోని పిల్లలను బలవంతం చేసినందుకు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి హంగరీ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ క్షమాభిక్ష ప్రసాదించారని గత వారం ప్రాంతీయ వార్తా సైట్ కథనాన్ని వెల్లడించడంతో భారీ వివాదం చెలరేగి దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించడం సంచలనం సృష్టించింది. గత శుక్రవారం నిరసనకారులంతా కలిసి ‘బాలల దోషికి క్షమాభిక్షని ప్రసాదించిన దేశ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ పదవికి రాజీనామా చేయాలి’ అని ఆ అధ్యక్షురాలు నివాసం ముందు ధర్నాకు దిగడం, ప్రధానితో పాటూ అధికార పక్షం మొత్తం ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేయడం, అలాగే ప్రతిపక్షాల నుంచి కూడ తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. తత్ఫలితంగా గత శనివారం నాడు దేశ అధ్యక్షురాలు కటాలిన్‌ నోవాక్‌ తన పదవికి రాజీనామా చేయాల్సిన విషమ పరిస్థితి నెలకొనడం గమనార్హం.

దోషి తాను పర్యవేక్షించిన పిల్లల దుర్బలత్వాన్ని..!

దుర్వినియోగం చేయలేదు అని నమ్మి నేను గత ఏప్రిల్‌ నెలలో క్షమాపణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ క్షమాపణ చాలా మంది వ్యక్తులలో అయోమయం మరియు అశాంతికి కారణమైంది. దోషికి క్షమాభిక్షని ప్రసాదించే విషయంలో నేను తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాను. నేను ముమ్మాటికి తప్పు చేశాను అని అంగీకరిస్తున్నాను. బాధితులందరికి క్షమాపణలు కోరుతున్నాను. నేను పిల్లల కుటుంబాలను రక్షించడానికి అనుకూలంగా ఉంటాను. నేను బాధితులందరికి అండగా నిలుస్తాను. పార్లమెంటు సభ్యురాలిగాను మరియు యూరోపియన్ పార్లమెంట్ జాబితా నాయకత్వం నుండి నేను వైదొలగుతున్నాను. మీరు నన్ను అధ్యక్షురాలిగా సంబోధించే చివరి ఈ రోజు ఈ క్షణం వరకు మాత్రమే ఉంటుంది. అంతిమంగా నేను ప్రజా జీవితం నుండి వైదొలుగుతున్నాను” అని వ్యాఖ్యానిస్తూ దేశ అధ్యక్షురాలు కటాలిన్‌ నోవాక్‌ ఈ ఫిబ్రవరి 10 నాడు తన అధ్యక్ష పదవికి రాజీనామాను చేయడాన్ని స్పష్టంగా గమనించవచ్చు.

కటాలిన్ నోవాక్ 2020 అక్టోబర్ నుండి 2021 వరకు.!

నాల్గవ ఓర్బన్ ప్రభుత్వంలో కుటుంబ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేసి మార్చి 2022లో హంగరీకి అధ్యక్షురాలు అయ్యారు. 44 సంవత్సరాల వయస్సులో అధ్యక్షురాలుగా ఎన్నికైన ఆమె ఆ పదవిని నిర్వహించిన మొదటి మహిళ మరియు అతి పిన్న వయస్కురాలుగా చరిత్రను సృష్టించారు. హంగేరియన్ ప్రజా జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఫోర్బ్స్ మ్యాగజైన్ లోను ఆమె స్థానాన్ని పొందడాన్ని ప్రత్యేకంగా గమనించవచ్చు.

కటాలిన్ నోవాక్ హంగేరియన్ అధ్యక్షురాలిగా…!

ఎక్కువగా ఆచార వ్యవహారాలను నిర్వహించిన మొదటి మహిళగా గుర్తింపు పొంది తనను తాను కుటుంబ కేంద్రీకృత క్రిస్టియన్ సంప్రదాయవాద రాజకీయవేత్తగా ముద్ర వేసుకున్నారు. తాను తీసుకున్న తప్పుడు క్షమాభిక్ష నిర్ణయం కారణంగా ప్రజాభీష్టం ఆందోళన మేరకు ఆమె తన అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయడం తద్వారా ‘తప్పు చేసిన వారు పదవులలో కొనసాగడం నైతికంగా ఏమాత్రం సరైనది కాదు’ అనే సందేశాన్ని సృష్టంగా వెల్లడించారు అని తప్పకుండా చెప్పవచ్చు. కాని నేడు ప్రజాసేవ అంటే ఏమిటో తెలియని వారు ‘మేము ప్రజాసేవ చేయడానికి రాజకీయాలలోకి వచ్చాము’ అని ప్రగల్భాలు పలుకుతూ తీరా గెలిచాక అసలు ప్రజా సేవను విస్మరిస్తూ పలు కుంభకోణాలతో పాలుపంచుకుంటూ అడ్డంగా దొరికిపోవడాన్ని ప్రజలు సునిశితంగా గమనిస్తూనే ఉన్నారు. అంతిమంగా ‘ప్రజా చెమట చుక్కల కష్టార్జిత వేల, లక్షల కోట్ల ధనాన్ని ఉన్నపళంగా దోచుకుంటున్న నేతలకు ప్రజాప్రతినిధులుగా కొనసాగే నైతిక హక్కు ఏమాత్రం లేదు’ అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ప్రజా సంక్షేమం పట్టని పాలకులు కటాలిన్ నోవాక్ మాదిరిగా స్వచ్చంధంగా రాజీనామాలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా హాంగేరీ దేశ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ రాజీనామా ‘రాజకీయాలకు రాచబాట’గా నిలవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Leave A Reply

Your email address will not be published.