మన్యం విప్లవ వీరుడు పండు పడాల్….!
-
గుమ్మడి లక్ష్మీనారాయణ ఆదివాసి రచయితల వేదిక
![]()
కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : మన దేశానికి స్వాతంత్ర్యం లభించడం వెనుక ఎందరో త్యాగధనుల పోరాట స్ఫూర్తి దాగున్నది. ఈనాటి భారతీయుల స్వేచ్ఛా వాణి వెనుక రక్తాన్ని ధార బోసిన వీరులలో వెలుగులోకి రానివారు మరెందరో ఉన్నారు. వారందరి అలుపెరగని పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. తెల్లదొరల సామ్రాజ్య, నిరంకుశత్వ, కుటిల, కుతంత్ర, కుట్రపూరిత, స్వార్ధ విషకోరల నుంచి భరత మాతకు విముక్తి కల్పించడానికి పట్టువీడని పోరాటం చేశారు. అలా పోరాడిన వారి చరిత్ర బయటకు రాలేదు. కొందరి చరిత్ర మాత్రమే వెలుగు చూస్తోంది. ఇంకా కానరాని వీరుల్లో బోనంగి పండు పడాల్… ఒక ఆదివాసీ యోధుడు. బ్రిటిష్ నిరంకుశ పాలనలో గిరిజనులు అనుభవిస్తున్న దయనీయ పరిస్థితిని తొలగించి, గిరిజనుల జీవితాలలో వెలుగు నింపడానికి అల్లూరి సీతారామరాజుతో కలసి పోరాడిన ధీరుడు పడాల్.
1922 నుంచి 1924 వరకు మన్యవిప్లవం..!
రగిలించిన అల్లూరి అనుచరుల్లో ‘గాం గంటన్నదొర, మల్లుదొరల తరువాతి చెప్పుకోదగిన స్థానం… బోనంగి పండు పడాల్ కి దక్కుతుంది. బోనంగి పండు పడాల్ నేటి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామ పంచాయతీకి చెందిన బోనంగి అందయ్య, బంగారమ్మ దంపతులకు 1890, ఆగస్టు 13న జన్మించారు. 22 ఏళ్ల వయస్సులో పడాల్ అదే గ్రామానికి చెందిన లింగయమ్మను వివాహం చేసుకున్నాడు. అప్పటికే బ్రిటిష్ పాలకుల దురాగతాలు పెచ్చుమీరుతున్న సమయంలోను అల్లూరి సీతారామరాజుతో పడాల్ కలిసి మన్యంలో సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టారు. అలా అల్లూరి పోరాటానికి పండు పడాల్ ఆకర్షితుడయ్యాడు. ఆయనను అనుసరించాడు. అల్లూరికి సహకారిగా ఉంటూ మన్యం పోరాటానికి కదం తొక్కారు. సాయుధ పోరాటంలో భాగంగా పోలీస్ స్టేషన్ల దాడుల్లో పండు పడాల్ అల్లూరితో కలిసి పోరాడారు. ప్రధానంగా 1922 సెప్టెంబరులో కృష్ణాదేవిపేట వద్ద బ్రిటిష్ సైనికాధికారులు హైటర్, క్లవర్టర్ల ను అంతమొందించిన దాడిలో పండు పడాల్ ప్రధాన భూమిక పోషించాడు. దీంతో బ్రిటిష్ పోలీసులు పండు పడాల్ ను ఆరాచకుల జాబితాలో చేర్చారు. ఆనాటి నుంచి అల్లూరి సీతారామరాజుతో పాటు ఆయన అనుచరుల్లో ఒకరైన పండు పడాల్ ని పట్టుకునేందుకు బ్రిటిష్ పోలీసులు కార్యాచరణ ప్రారంభించారు. దీంతో పండు పడాల్ అజ్ఞాత జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది.
1924, ఏప్రిల్ 7న అల్లూరి సీతారామరాజు మరణం…!
అనంతరం పండు పడాల్ కోసం బ్రిటిష్ పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం పండు పడాల్ వివరాలు, ఆచూకి తెలిపిన వారికి వంద రూపాయలు బహుమానం ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు చనిపోయిన కొద్ది రోజుల తర్వాత పండు పడాల్ తన స్వగ్రామం అయిన గొండిపాకలు గ్రామానికి వెళ్ళాడు. అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం అతని కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేస్తోంది. దీంతో పండు పడాల్ సోదరి(అక్క) రామాయమ్మ అతడిని భోజనానికి ఇంటికి పిలిచి బ్రిటిష్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. భోజనానికి వచ్చిన పండు పడాల్ని పోలీసులు 1924 జూన్ లో అరెస్టు చేశారు. పండు పడాల్ సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని అనుభవించారు. బ్రిటిష్ పోలీసులకు పట్టుబడిన పడాల్ కు విశాఖపట్నం సెషన్స్ కోర్టు 1925, మే 11న మరణశిక్ష విధించింది. ఈ శిక్షను మళ్లీ యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. దీంతో రాజమండ్రి, కన్నూరు, తిరుచురాపల్లి, పాయంకోట మరియు మద్రాస్ జైలులో ఉంచి తర్వాత అక్కడి నుంచి అండమాన్ కు ఓడలో తీసుకుని వెళ్లారు. 1926లో పడాల్ని అండ మాన్ లో ప్రవాస శిక్షకు పంపించారు. నాటి నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు అండమాన్ సెల్యూలార్ జైలులో శిక్షను అనుభవించాడు.
అండమాన్ లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. విడుదలైన వెంటనే తహసీల్దార్ ద్వారా గొందిపాకలు లోనున్న అతని భార్య లింగాయమ్మను అండమాన్ రప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె నిరాకరించింది. దీంతో అండమాన్ లో పార్వతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. 1974 ఫిబ్రవరి 11న పండు పడాల్ అండమాన్ లోనే మరణించాడు. 1973లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పడాల్ జీవిత చరిత్రను సేకరించింది. అప్పట్లో ఓ తెలుగు దినపత్రిక పడాల్ జీవిత చరిత్రను ప్రముఖంగా ప్రచురించింది. ఆయన పోరాటపటిమకు స్ఫూర్తిగా పడాల్ కుటుంబ సభ్యులు 2012, ఫిబ్రవరి 28న గొందిపాకలులో పడాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏటా ఆ గ్రామస్థులు పండు పడాల్ జయంతిని ఆగస్టు 13న ఘనంగా నిర్వహిస్తున్నారు. 1922 నుండి 1924 వరకు దాదాపుగా రెండేళ్లు సాగిన మన్యం పోరాటంలో, ఎందరో వీరులు తమ జీవితాలను ధారపోశారు. తాము జైలు గోడల మధ్య చిత్రహింసలను అనుభవించి, స్వాతంత్ర్యాన్ని మనకు అందించిన పడాల్ వంటి వారెందరో గుర్తింపుకు నోచుకోకుండా జీవితాలు చాలించారు. ఆ వీరులందరి త్యాగఫలం అనుభవిస్తున్న సందర్భంలో అనామక యోధుడైనా పడాల్ పోరాట చరిత్రను భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.
