Take a fresh look at your lifestyle.

విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే వారిని ఉపేక్షించం : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

0 13

గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్.
విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే వారిని ఉపేక్షించం.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
రేగొండ, జూలై 3: విద్యార్థుల సంక్షేమంలో నిర్లక్ష్యం వహించి ఇబ్బందులకు గురిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హెచ్చరించారు. శుక్రవారం జయశంకర్-భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న ఈ పాఠశాలలో మరుగుదొడ్ల సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్ పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం భవనం యజమానిని పిలిపించి విద్యార్థుల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. వెంటనే మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, స్నానాల కోసం నీటి నల్లాల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచినట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గాంధీనగర్ వద్ద సమీకృత (ఇంటిగ్రేటెడ్) పాఠశాల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులు, పాఠశాల, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు తమ సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఈడబ్ల్యూఐడీసీ ఏఈ జీవన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్ మౌనిక, ప్రధానోపాధ్యాయురాలు అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.