పీకే ఓసీ డీప్‌సైడ్ గనిని సింగరేణికే కేటాయించాలి : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే పాయం, ఎంపీ బలరాం నాయక్ వినతి.
పీకే ఓసీ డీప్‌సైడ్ గనిని సింగరేణికే కేటాయించాలి.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే పాయం, ఎంపీ బలరాం నాయక్ వినతి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మణుగూరు, జూలై 3: మణుగూరు ప్రాంత అభివృద్ధి, వేలాది మంది కార్మికుల ఉపాధి పరిరక్షణ దృష్ట్యా పీకే ఓసీ డీప్‌సైడ్ ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిని సింగరేణి కాలరీస్ సంస్థకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేసిన వారు, ప్రస్తుతం పీకే ఓసీ డీప్‌సైడ్ గని కేటాయింపులో సింగరేణి కాలరీస్ సంస్థ, తెలంగాణ జెన్‌కో మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి గనిని సింగరేణికే కేటాయించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ గనిలో సుమారు 181 మిలియన్ టన్నుల జీ-8 గ్రేడ్ బొగ్గు నిల్వలు ఉన్నాయని, గని జీవితకాలం దాదాపు 20 సంవత్సరాలు ఉంటుందని, దీనివల్ల సింగరేణికి సుమారు రూ.1,500 కోట్ల లాభదాయకత చేకూరే అవకాశం ఉందని వినతిపత్రంలో వివరించారు. గనిని సింగరేణికి కేటాయించకపోతే మణుగూరు ప్రాంత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని, ప్రస్తుతం ఉన్న గనులు దశలవారీగా మూతపడే పరిస్థితుల్లో శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఓబీ కార్మికులు, లారీ యజమానులు, డ్రైవర్లు, మెకానిక్‌లు, చిన్న వ్యాపారులు, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మణుగూరు ప్రాంత భవిష్యత్తు, సింగరేణి సంస్థ పరిరక్షణ, వేలాది మంది కార్మికుల ఉపాధి భద్రత దృష్ట్యా పీకే ఓసీ డీప్‌సైడ్ ఓపెన్‌కాస్ట్ గనిని సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ బలరాం నాయక్ సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందిస్తూ, మణుగూరు ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.