కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లులు తరలించాలి

కామారెడ్డి జిల్లా , నవంబర్ 13 ( లోకంతీరు ) : కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించి, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం యొక్క తేమశాతం పరిశీలించి, నిబంధనల మేరకు కొనుగోలు చేయాలనీ, కొనుగోలు చేసిన ధాన్యం ను సెంటర్ కు కేటాయించిన రైస్ మిల్లుకు తరలించాలని తెలిపారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం ను ట్యాబ్ ఎంట్రీ చేయాలని తెలిపారు. రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహీల్దార్ రహీముద్దీన్, సెంటర్ ఇంచార్జి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటి సమగ్ర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ను పకడ్బందీగా అన్ని అంశాలకు సంబంధించిన వివరాలను ప్రతీ ఇంటి యజమాని నుండి సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో చేపడుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీచేసిన ప్రశ్నావళి ప్రకారం ప్రతీ ఇంటిలోని వారి నుండి పూర్తి సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని తెలిపారు. కుటుంబం లోని ప్రతీ ఒక్కరి సమాచారాన్ని నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి రాజారాం, మండల పరిషత్ అధికారి సబిత, తదితరులు పాల్గొన్నారు.