Take a fresh look at your lifestyle.

భూ భారతి విజయవంతానికి రీ-సర్వేనే కీలకం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.

0 23

భూ భారతి విజయవంతానికి రీ-సర్వేనే కీలకం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

  • మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే పూర్తి.
  • లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.60 చెల్లింపు.
  • సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి.
  • ఇందిరమ్మ ఇళ్లు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీపై ప్రత్యేక దృష్టి.
  • ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, జూలై 11:

భూ భారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొనగా, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్‌ను రద్దు చేసి రైతుల భూ హక్కులకు పూర్తి రక్షణ కల్పించే లక్ష్యంతో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయామని పేర్కొన్నారు. ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి భూ భారతిలో అవకాశం కల్పించడంతో పాటు హైకోర్టు సంబంధిత సమస్యలను కూడా పరిష్కరించామని తెలిపారు. అయినప్పటికీ అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

భూ భారతి చట్టం విజయవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావుల సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. రీ-సర్వేలో శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లైసెన్స్ సర్వేయర్లకు ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి ములుగుమాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే ప్రారంభించినట్లు వెల్లడించారు.

రీ-సర్వే కోసం అత్యాధునిక నాణ్యత గల పరికరాలను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అవసరమైన సిబ్బంది, పరికరాలు, మౌలిక వసతులు సమకూర్చి భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని, మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 చెల్లించి మొత్తం రూ.60 అందజేస్తామని మంత్రి ప్రకటించారు. చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్లకు గడువు విధించి, గడువులోగా చేరని వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. వారికి బీమా, సామాజిక భద్రత కల్పించే చర్యలు కూడా చేపడతామని వెల్లడించారు.

ఒక సర్వే నంబరులో కొంత భూమిని మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించి నోటీసులు జారీ చేయాలని సూచించారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వచ్చిన 6,500 రెవెన్యూ సమస్యల్లో 98 శాతం సమస్యలకు భూ రీ-సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి తొలి విడత పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అప్పగించి, మిగిలిన పనులకు అవసరమైన నిధులు విడుదల చేయాలని సూచించారు. నిధులు విడుదలైనప్పటికీ పనులు ప్రారంభించని చోట్ల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, మొదటి విడతలో మంజూరు కాకపోయిన అర్హులను కూడా రెండో విడతలో చేర్చాలని ఆదేశించారు. ఇసుక, కంకర సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ మాట్లాడుతూ తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో రీ-సర్వేను నవంబర్‌లోపు పూర్తి చేయాలని, రెండో విడతలో మరో 70 గ్రామాల్లో మార్చి-2027లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రీ-సర్వే పూర్తయితే సాదాబైనామా దరఖాస్తుల తిరస్కరణలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.

తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన గుడిసెలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఆగస్టు నాటికి రెండు లక్షల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని సూచించారు.

సెర్ప్ సీఈవో దివ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల యూనిఫాంలను స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్లతో కుట్టిస్తున్నామని తెలిపారు. వస్త్రాల సరఫరా ఆలస్యమైనప్పటికీ జూలై 15లోపు రెసిడెన్షియల్ బాలికలకు, జూలై 30లోపు బాలురకు యూనిఫాంలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందేలా కలెక్టర్లు, డీఆర్‌డీఏ, గురుకులాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మాట్లాడుతూ తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో భూ రీ-సర్వే చేపట్టామని తెలిపారు. సీఎస్‌ఆర్ నిధులతో నాలుగు ఆధునిక సర్వే యంత్రాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. గ్రామాల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి ప్రత్యేక సమన్వయంతో ముందుకు సాగుతున్నామని, భూ రీ-సర్వేపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. సర్వే అనంతరం నోటీసులు జారీ చేస్తున్నామని, కుటుంబ వివాదాలు మినహా ఇప్పటివరకు పెద్దగా అభ్యంతరాలు రాలేదని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం ఆర్డీఓ ఎన్. శ్రీనివాస్, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.