సింగరేణిలో అందని ద్రాక్షగా మారిన వారసత్వ ఉద్యోగాలు.
కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఆశలను వమ్ము చేస్తోంది: అప్పాని శ్రీనివాస్.
సింగరేణి కార్మిక కుటుంబాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 19: సింగరేణి కార్మికులకు అత్యంత కీలకమైన వారసత్వ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బిఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఎస్సీఎంకేఎస్) అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో కార్మిక కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా కార్మికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు. సింగరేణి కార్మికుల మనసులో వారసత్వ ఉద్యోగం ఒకటే పెద్ద ఆశగా నిలిచిందని, అయితే ఆ ఆశను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మెడికల్ బోర్డుల పేరుతో కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రేస్ ప్రభుత్వం హామీ, సింగరేణి యాజమాన్యం శనివారం విడుదల చేసిన మెడికల్ బోర్డ్ ఫలితాల్లో కనిపించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న అనేక మంది కార్మికులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, వారికి మెడికల్ బోర్డు ద్వారా వైద్యపరమైన ధ్రువీకరణ చేసి వారసత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో పాదయాత్రలు, సభల్లో కాంగ్రెస్ నాయకులు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. “కార్మికుల డిమాండ్ ఒక్కటే… అనారోగ్యంతో పనులు చేయలేని కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహించి, మెడికల్‌గా అన్‌ఫిట్‌గా గుర్తించి, వారికి గతంలో అమలైన విధంగానే వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి” అని అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.సింగరేణి అభివృద్ధికి దశాబ్దాలుగా కార్మికులు తమ శ్రమను అంకితం చేశారని, వారి కుటుంబాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఎస్సీఎంకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అప్పాని శ్రీనివాస్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకుని కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.