అందెశ్రీ స్మృతివనం వేదికను రాజకీయాలకు వాడొద్దు: బీఆర్ఎస్ నేతల విమర్శ.
– సాహిత్య కార్యక్రమంలో రాజకీయ వ్యాఖ్యలు తగవన్న రాగిడి లక్ష్మారెడ్డి.
– ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఘట్‌కేసర్, జూలై 19:రాష్ట్ర కవి అందెశ్రీ స్మృతివనం భూమిపూజ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలకు తావు కల్పించడం తగదని పేర్కొన్నారు. ఆదివారం ఘట్‌కేసర్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్లు జక్కా వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర కవి అందెశ్రీ సేవలను స్మరించాల్సిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలు అనుచితమని, ముఖ్యమంత్రి హోదాకు తగిన హుందాతనం, సంయమనం పాటించాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాల కల్పన వంటి హామీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి పథంలో ముందుకు సాగాయని పేర్కొన్న ఆయన, మేడ్చల్ నియోజకవర్గంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని ఆరోపించారు. అలాగే జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్య సమస్య, ఘట్‌కేసర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం వంటి స్థానిక సమస్యలను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, రాజకీయ విమర్శలకు బదులుగా ఎన్నికల హామీల అమలుపై చిత్తశుద్ధితో పనిచేయాలని రాగిడి లక్ష్మారెడ్డి కోరారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు.