భూ రీ-సర్వే, అటవీ-రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
భూ రీ-సర్వే, అటవీ–రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
– రీ-సర్వే పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించేది లేదు.
– నిర్ణీత గడువులో సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.
– రెవెన్యూ–అటవీ–పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలి.
– శ్రీనివాసగుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచన.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 19: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో భూముల రీ-సర్వే పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు అటవీ–రెవెన్యూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీ-సర్వే పనుల్లో జాప్యం, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేస్తూ, రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూ వివాదాలను పరిష్కరించాలని సూచించారు. ఆదివారం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి జిల్లాలో భూముల రీ-సర్వే, అటవీ–రెవెన్యూ భూ సమస్యలు, పోడు భూముల అంశం, పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. జిల్లాలో 70 గ్రామాల్లో చేపట్టిన రీ-సర్వే పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి, ప్రస్తుతం 14 గ్రామాల్లో పనులు కొనసాగుతుండగా ఐదు గ్రామాల్లో పూర్తైనట్లు అధికారులు వివరించారు. మిగిలిన గ్రామాల్లో కూడా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. పాల్వంచలో రీ-సర్వే పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చి చాలా కాలమైనప్పటికీ పనులు నెమ్మదిగా సాగడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన, జాప్యానికి కారణాలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సర్వే నిర్వహించాలని సూచించారు. అవసరమైతే అదనపు సర్వేయర్లు, రోవర్ పరికరాలు, సాంకేతిక సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అటవీ–రెవెన్యూ భూ సమస్యలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భూ వివాదాలను చట్టబద్ధంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ప్రతి నెల సమీక్ష సమావేశాలు నిర్వహించి పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. పోడు భూముల అంశంపై మాట్లాడుతూ, కొత్తగా పోడు సాగు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో పోడు సాగు చేసిన రైతుల సమస్యలను ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మానవీయ దృక్పథంతో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై సమీక్షించిన మంత్రి, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునేలా రహదారి నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శ్రీనివాసగుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో భూముల రీ-సర్వే పనులు దశలవారీగా కొనసాగుతున్నాయని, మిగిలిన గ్రామాల్లో కూడా నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖల సమన్వయంతో భూ సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా రీ-సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, ఐటిడిఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు, రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.