
ఉద్యాన పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి.
ఎల్నినో నేపథ్యంలో నీటి పొదుపుపై రైతులకు అవగాహన.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, అక్టోబర్ 13: ఎల్నినో ప్రభావంతో మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల్లో రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి ఎం.వి. మధుసూదన్ సూచించారు. మంగళవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తెట్టేలాపాడు గ్రామంలో మిరప, టమాటా పంటలను ఆయన సందర్శించి, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ.. నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ, పంట అవసరాలకు అనుగుణంగా సాగునీటిని అందించాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అవసరానికి మించి నత్రజని ఎరువులు వినియోగిస్తే రసం పీల్చే పురుగుల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాబట్టి రైతులు ఎరువులను సమతుల్యంగా వినియోగిస్తూ, పంటలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలేరు ఉద్యాన అధికారి పి. అపర్ణతో పాటు రైతులు నరసింహారావు, లాలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.