Take a fresh look at your lifestyle.

సింగరేణి అధికారుల పీఆర్‌పీ బకాయిలు వెంటనే చెల్లించాలి : టిబిజికేఎస్

0 24

సింగరేణి అధికారుల పీఆర్‌పీ బకాయిలు వెంటనే చెల్లించాలి.
మణుగూరులో రిలే నిరాహార దీక్షలకు టిబీజీకేఎస్ సంఘీభావం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మణుగూరు, జూలై 3: సింగరేణి అధికారులకు రావాల్సిన పనితీరు ఆధారిత ప్రోత్సాహకం (పీఆర్‌పీ) బకాయిలతో పాటు ఇతర న్యాయబద్ధమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టిబీజీకేఎస్ మణుగూరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సింగరేణి అధికారుల సంఘం (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన నాగెల్లి వెంకటేశ్వర్లు, దీక్షలో పాల్గొంటున్న అధికారులు, మహిళా అధికారులకు పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపు మేరకు అధికారుల న్యాయమైన డిమాండ్లకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు చెప్పారు. సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్‌పీ) బకాయిల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలతో పాటు సింగరేణి అధికారులను కూడా నిరాశపరిచిందని విమర్శించారు. సంస్థ అభివృద్ధి కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న అధికారుల సేవలను గుర్తించి వారికి రావాల్సిన ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2007లో పీఆర్‌పీ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కోల్ ఇండియాలో ప్రతి ఏడాది పీఆర్‌పీ చెల్లిస్తున్నారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు హయాంలో ఎలాంటి ఆందోళనలు లేకుండానే సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ సంప్రదాయాన్ని కొనసాగించకుండా ప్రభుత్వం పీఆర్‌పీ చెల్లింపును నిలిపివేసిందని ఆరోపించారు. సింగరేణి సంస్థకు అధికారులు, కార్మికులు రెండు కళ్లలాంటివారని, ఇరువర్గాలు సమన్వయంతో పనిచేస్తేనే సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అధికారుల న్యాయమైన హక్కులకు భంగం కలిగితే టిబీజీకేఎస్ వారి పోరాటానికి అండగా నిలుస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బంగారి పవన్ కుమార్, జంగం రాజ్‌కుమార్, పి.కె. నాగరాజు, బొద్దుల ప్రవీణ్, కమటం పరమేష్, దాసుమల్ల ప్రవీణ్ కుమార్, దాసరి కృష్ణ, కోన వెంకటేష్, అజ్మీరా అశోక్ కుమార్, కల్యాణ్, ఆదర్శ్, రఘు జగదీష్, మంగీలాల్ సర్వేశ్, రాజేష్, రఫీక్, ప్రవీణ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.