
మందమర్రి ఏరియాలో సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు పర్యటన.
ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు సూచన.. నూతన పంప్‌హౌస్ ప్రారంభం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మందమర్రి, అక్టోబర్ 22: సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కొప్పుల వెంకటేశ్వర్లు గురువారం మందమర్రి ఏరియాలో విస్తృతంగా పర్యటించి ప్రాజెక్టుల పురోగతి, బొగ్గు ఉత్పత్తి, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. జీఎం ఎన్. రాధాకృష్ణ, ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గనుల ఏజెంట్లతో సమావేశమై ఉత్పత్తి లక్ష్యాలు, ప్రణాళికలను సమీక్షించి పలు సూచనలు చేశారు. క్లోజ్డ్ కేకే-2 మైన్ సమీపంలోని నర్సరీ వెనుక 2 హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ మొక్కలను డైరెక్టర్ నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎం ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియాలో చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. ఆయిల్‌పామ్ మొక్కల జీవితకాలం 30 ఏళ్లు ఉంటుందని, వాటిని సక్రమంగా సంరక్షిస్తే సంస్థకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. మందమర్రిని ఆదర్శంగా తీసుకుని ఇతర సింగరేణి ఏరియాల్లోనూ ఈ సాగును విస్తరించాలని సూచించారు. అనంతరం కేకే ఓసీపీ వ్యూ పాయింట్‌ను సందర్శించి క్వారీలోని పనులను పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు రక్షణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, నిర్దేశిత లక్ష్యాల సాధనకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. మందమర్రి పట్టణ ప్రజల తాగునీరు, ఇతర అవసరాల కోసం చెత్లాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పంప్‌హౌస్‌ను డైరెక్టర్, జీఎం ప్రారంభించారు. మూసివేసిన కేకే-1 గనిలోని నీటిని పంప్‌హౌస్‌కు తరలించి శుద్ధి చేసి ప్రజలకు అందించేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు జీఎం తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, ఎండలు పెరిగి నీటి కొరత, విద్యుత్ సమస్యలు తలెత్తే అవకాశమున్నందున నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రతిష్టాత్మకమైన శ్రావణపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాంతాలను, గ్రామాలను కూడా డైరెక్టర్ పరిశీలించారు. ఈ పర్యటనలో మందమర్రి ఏరియా ఎస్‌ఓటూ జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శులు సలేంద్ర సత్యనారాయణ, దాగ మల్లేష్, ఏరియా ఇంజనీర్ (ఈ అండ్ ఎం) బాలాజీ భగవతి, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు, కేకే గ్రూప్ ఏజెంట్ ఖాదిర్, శాంతిఖని ఏజెంట్ సంతోష్ కుమార్, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, ఫారెస్ట్ అధికారి నవీన్, డీజీఎం (సివిల్) మదీనా భాష, డీజీఎం (సర్వే) భూక్య దేశాయ్, ఏరియా సెక్యూరిటీ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, వర్క్‌షాప్ ఇన్‌చార్జి డీజీఎం నరేష్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.