Take a fresh look at your lifestyle.

ప్రత్యేక అధికారులు సమర్ధవంతంగా సేవలు అందించాలి…

0 1,689

ప్రత్యేక అధికారులు సమర్ధవంతంగా సేవలు అందించాలి.

  • తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి.
  • ఈ నెల 07 నుండి 15 వరకు జీ.పీలలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్.
  • వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి.అనసూయ దిశానిర్దేశం.

 నిజామాబాద్, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ) : గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు తమ బాధ్యతలను గుర్తెరిగి ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్ట్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సూచించారు. పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు లతో కలిసి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, సంభందిత శాఖల అధికారులు, గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సర్పంచ్ ల పదవీకాలం ముగిసిన నేపద్యంలో ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినందున వారు అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలని హితవు పలికారు. స్పెషల్ ఆఫీసర్లకు వారి అధికారాలు, బాధ్యతల గురించి పరిపూర్ణంగా తెలియజేసేందుకు వీలుగా అవగాహన కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా వేసవి సీజన్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి ఉత్పన్నం కాకుండా, ఇంటింటికి రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కార్యోన్ముఖులు చేశారు. మంచినీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించడం, క్లోరినేషన్, పైప్ లైన్ లీకేజీల మరమ్మత్తులు వంటి ప్రతి అంశంపై దృష్టి సారించాలన్నారు. వీటితో పాటు మొక్కల పెంపకం, తడి-పొడి చెత్త వేరుచేయడం, నర్సరీల నిర్వహణ, పన్ను వసూళ్లు వంటి బాధ్యతలను పక్కాగా నిర్వర్తిస్తూ, ఆయా పనులను నిశితంగా పర్యవేక్షణ జరపాలన్నారు. ముఖ్యంగా ఈ నెల 07 నుండి 15 వ తేదీ వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టి పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి ఆదర్శంగా నిలిచిన ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి పండుగ వాతావరణంలో సన్మానించాలని కలెక్టర్లకు సూచించారు. యువత, మహిళలను స్పెషల్ డ్రైవ్ లో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని, యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారకుండా గ్రామ ప్రగతిలో మమేకం అయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. కాగా, నాగోబా, మేడారం వంటి జాతరలు జరిగే ప్రదేశాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేలా, తద్వారా ప్రకృతి పర్యావరణానికి హాని కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ పథకాల పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు బావన్న, శంకర్, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ విభాగం అధికారి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.