పౌర హక్కుల సంఘం నేత కిడ్నాప్ ను ఖండిస్తున్నాం
- ప్రభుత్వమే పోగుల రాజేశం ను రక్షించాలి
- పొంతన లేని పోలీసుల సమాచారం
- రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి

జగిత్యాల, ఫిబ్రవరి 11 ( లోకంతీరు ) : పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ కోశాధికారి పోగుల రాజేశం ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడాన్ని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి తదితరులు తీవ్రంగా ఖండించారు.ఆదివారం వారు జగిత్యాలలో విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు స్పందించి పోగుల రాజేశం ను కిడ్నాపర్ల నుండి రక్షించాలని కోరారు.జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన రాజేశం ను తన ఇంట్లో నుండి 11 ఫిబ్రవరి, 2024 ఆదివారం ఉదయం 9-00 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లలో వచ్చి బలవంతంగా పోగుల రాజేశం ను కొట్టి తీసుకెళ్లడం జరిగిందన్నారు. వెంట వెళ్లిన రాజేశం భార్య మల్లవ్వను సారంగపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుక పోతున్నామంటూ కొంత దూరం తీసుకపోయిన తర్వాత కార్లో నుండి దింపివేసి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది అన్నారు.
స్థానికులు ఫోన్ ద్వారా సారంగపూర్ ఎస్సై ని సంప్రదిస్తే , చత్తీస్ ఘఢ్ పోలీసులని, అక్కడ రాజేశంపై కేసు ఉందని చెప్పి తీసుక వెలుతున్నారని సమాచారాన్ని సారంగపూర్ ఎస్సై తెలిపినట్లు వివరించారు.
కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘం నాయకులు స్థానికి డిఎస్పీ ని కలిస్తే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా గీధం పోలీసులు తీసుకెళ్లారని చెప్పారని తెలిపారు.పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీ సన్ ఫ్రీత్ సింగ్ ను సంప్రధిస్తే మాకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారని అన్నారు.ఎలాంటి ఐడి కార్డ్ లు చూపించకుండా, నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా పోగుల రాజేశన్ను తీసుకుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులకుగానీ, రాజేశంకు గానీ ఎలాంటి సమాచారాన్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా కొట్టి కిడ్నాప్ చేయడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులే తెలపాలని, వెంటనే పోగుల రాజేశంను కిడ్నాపర్ ల నుండి రక్షించాలని పౌర హక్కుల తెలంగాణ డిమాండ్ చేస్తుందన్నారు.స్థానిక పోలీసులకు సమాచారం లేకుండా, స్థానిక పోలీసులను వెంబడి తీసుకు రాకుండా కిడ్నాప్ చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాజేశం అక్రమ కిడ్నాప్ నుండి, అక్రమ నిర్బందం నుంచి విడుదల చేయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న పౌరహక్కుల సంఘం కార్య కర్తలు, రచయితలు, జర్నలిస్టులు, మేధావుల ను బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, అక్రమ సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వీటన్నిటిని ఆపివేయాలని డిమాండ్ చేశారు.
పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పుల్ల సుచరిత, ఉపాధ్యక్షుడు నార వినోద్,సహాయ కార్యదర్శి గడ్డం సంజీవ్ కుమార్, కార్యవర్గ సభ్యులు కడ రాజన్న, మోటపలుకుల వెంకట్,రాజేశం భార్య పోగుల మల్లవ్వ, కొడుకు పోగుల శ్రీను తదతరులు ఉన్నారు.