ఆదర్శంగా నిలుస్తున్న దేవునిపల్లి పాఠశాల ఉపాధ్యాయులు

కామారెడ్డి జిల్లా , సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల రూటే సపరేట్ గా కనిపిస్తుంది. పాఠశాలలోని మరుగుదొడ్లు, మూత్రశాలల, పాఠశాల మెయింటెనెన్స్ కోసం 20 మంది ఉపాధ్యాయులు ప్రతినెల 500 చొప్పున గత మూడు సంవత్సరాల నుంచి ఖర్చు పెడుతున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాకిషన్ తెలిపారు. తమ వంతు బాధ్యతగా పాఠశాల బాగుండాలని, విద్యార్థుల ఉపాధ్యాయుల సౌకర్యార్థం స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు డబ్బులు ఇస్తారని, దీనికి తోడు స్థానిక కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి నెలకు 5000 రూపాయల చొప్పున పాఠశాల అభివృద్ధికి విరాళం అందిస్తున్నారని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు జంగం శ్రీశైలం, చిందం సాయిలు, సహేందర్ 2020 సంవత్సరంలో పాఠశాలకు ఇబ్బంది అవుతుందని తలచి తోటి ఉపాధ్యాయుల అందరికీ విషయాన్ని చేరవేసి స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చేలా ప్రోత్సహించారు. స్వచ్ఛందంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు గొప్ప తనం జిల్లాలోని పాఠశాలలకు కనువిప్పు కావాలి.