ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలన్నింటినీ మ్యాపింగ్ చేయాలి.
నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలి.
ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూన్ 17: జిల్లాలో ఎరువులు, విత్తనాలు విక్రయించే అన్ని దుకాణాలను మ్యాపింగ్ చేసి పటిష్ట పర్యవేక్షణలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయాలను పూర్తిగా అరికట్టడంతో పాటు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును వేగవంతం చేయాలని సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎరువులు, విత్తనాల విక్రయాలు, రైతు వేదికల మ్యాపింగ్, ఫార్మర్ రిజిస్ట్రీ తదితర అంశాలపై వ్యవసాయ, సహకార, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 38 రైతు వేదికల ద్వారా ఎరువులు, విత్తనాల విక్రయాలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు 15 రైతు వేదికల మ్యాపింగ్ పూర్తయిందని, మిగిలిన 23 రైతు వేదికల మ్యాపింగ్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి విక్రయాలు ప్రారంభించాలని ఆదేశించారు. రైతులు యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని పొందే విధానంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన ధాన్యం సాగు విధానాలపై రైతుల్లో చైతన్యం కల్పించేందుకు డీపీఆర్వో ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శనలు నిర్వహించాలని తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయదారులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాల విక్రయాలు గుర్తిస్తే వెంటనే పోలీసు కేసులు నమోదు చేసి, సంబంధిత డీలర్ల లైసెన్సులను రద్దు చేయాలని స్పష్టం చేశారు. విక్రయ కేంద్రాల వద్ద పటిష్ట పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి కేంద్రంలో మండల స్థాయి అధికారి, పోలీసు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఎరువుల విక్రయాల ప్రక్రియ మొత్తాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపారు. మండలాల వారీగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును సమీక్షించిన కలెక్టర్, జిల్లాలో ప్రస్తుతం నమోదు 66.77 శాతానికి మాత్రమే పరిమితమవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన నమోదును త్వరితగతిన పూర్తి చేసి లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, సహకార శాఖ అధికారి వాలియా నాయక్, వ్యవసాయ శాఖ ఏడీఏలు రమేష్, శ్రీపాల్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.