Take a fresh look at your lifestyle.

సింగరేణి సమ్మెపై చర్చలు జూలై 10కు వాయిదా.

0 17

సింగరేణి సమ్మెపై చర్చలు జూలై 10కు వాయిదా.
కార్మికుల 31 డిమాండ్లపై హైదరాబాద్‌లో సుదీర్ఘ చర్చలు.
సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె అనివార్యమని ఎఐటీయూసీ హెచ్చరిక.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్/భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 25:సింగరేణి కార్మికుల 31 డిమాండ్ల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఎఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై గురువారం హైదరాబాద్‌లో కీలక చర్చలు జరిగాయి. డిప్యూటీ లేబర్ కమిషనర్ డాక్టర్ శాశ్వతి రథ్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లు, ఉద్యోగ భద్రత, సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చించిన అనంతరం తదుపరి సమావేశాన్ని జూలై 10వ తేదీకి వాయిదా వేశారు. సింగరేణి కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు, అమలు కాని ఒప్పందాలు, సంక్షేమ అంశాల పరిష్కారం కోసం ఎఐటీయూసీ ఈ నెల 8న యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది. దీనిపై స్పందించిన రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) కార్యాలయం చర్చలకు పిలుపునివ్వడంతో హైదరాబాద్‌లో సుదీర్ఘ సమావేశం జరిగింది. ఉదయం ప్రారంభమైన చర్చల్లో కార్మికుల తరఫున ఎఐటీయూసీ నాయకులు 31 డిమాండ్ల ప్రాధాన్యత, వాటి అమలులో జరుగుతున్న జాప్యం, కార్మికులపై పడుతున్న ప్రభావాన్ని వివరించారు. యాజమాన్యం కూడా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఇరుపక్షాల వాదనలు విన్న డిప్యూటీ లేబర్ కమిషనర్ డాక్టర్ శాశ్వతి రథ్, సమస్యలపై మరింత లోతైన చర్చ అవసరమని అభిప్రాయపడుతూ తదుపరి సమావేశాన్ని జూలై 10కు వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఎఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే సమ్మె అనివార్యమవుతుందని హెచ్చరించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, అవసరమైతే మరింత ఉధృతమైన ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చర్చల్లో ఎఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శి కే. సారయ్య పాల్గొన్నారు. యాజమాన్యం తరఫున ఏజీఎం (పర్సనల్) అజయ్ కుమార్ హాజరయ్యారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై జూలై 10న జరిగే తదుపరి చర్చలు కీలకంగా మారనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.