Take a fresh look at your lifestyle.

మైనింగ్ స్టాఫ్‌కు ఓవర్‌మెన్ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి : రియాజ్ అహ్మద్.

0 34

మైనింగ్ స్టాఫ్‌కు ఓవర్‌మెన్ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి.
డిమాండ్ల సాధన కోసం వచ్చిన ఉద్యోగులను పోలీసులతో అడ్డుకోవడం దురదృష్టకరం.
మైనింగ్ స్టాఫ్ ఉద్యమానికి హెచ్‌ఎంఎస్ సంపూర్ణ మద్దతు.
గుర్తింపు సంఘాల వైఫల్యంతోనే నేటి పరిస్థితి: రియాజ్ అహ్మద్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 25: సింగరేణిలో మైనింగ్ స్టాఫ్‌కు రావాల్సిన ఓవర్‌మెన్ ప్రమోషన్లను యాజమాన్యం వెంటనే మంజూరు చేయాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా పోలీసు బలగాలను ఉపయోగించి ఉద్యమాలను అణిచివేయాలని చూడటం సరికాదని హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అన్నారు. మైనింగ్ స్టాఫ్ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన గుర్తింపు సంఘాలు గతంలో చేసిన తప్పిదాల ఫలితంగానే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. మైనింగ్ స్టాఫ్ ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తూ గురువారం ఆయన మీడియాకు ఒక వీడియోను విడిదల చేశారు. సింగరేణిలో మైనింగ్, టెక్నికల్, ఎస్సెన్షియల్ స్టాఫ్‌లకు ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయని, ముఖ్యంగా గనుల్లో భద్రతా చర్యలు, బ్లాస్టింగ్ వంటి కీలక పనులు మైనింగ్ స్టాఫ్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాంటి మైనింగ్ సిబ్బందికి సంబంధించి గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం డిప్లొమా అర్హత కలిగిన ఉద్యోగులందరికీ సూపర్‌వైజర్ లేదా ఓవర్‌మెన్ హోదా కల్పించాల్సి ఉండగా, ఆ విధానాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. డిప్లొమా అర్హతతో నియమితులైన ఉద్యోగులకు నేరుగా ఓవర్‌మెన్ హోదా ఇవ్వాల్సిన చోట షాట్ ఫైరర్, సర్దార్ పోస్టుల్లో కొనసాగించారని, దాదాపు 400 మందికి పైగా ఉద్యోగులు ఇప్పటికీ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై పోరాడాల్సిన టీబిజికేఎస్, ఏఐటీయూసీ సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రభుత్వ అనుబంధంగా ఉన్న ఐఎన్‌టీయూసీ కూడా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడలేకపోయిందని విమర్శించారు. గతంలో జరిగిన తప్పిదాలను ఇప్పుడు యాజమాన్యం అవకాశంగా తీసుకుని “మీకు ఎలాంటి ప్రమోషన్లు రావు” అనే ధోరణితో వ్యవహరించడం అన్యాయమని రియాజ్ అహ్మద్ అన్నారు. ఉద్యోగులు తమ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తుంటే, వారితో చర్చలు జరపాల్సిన యాజమాన్యం పోలీసులను రంగంలోకి దింపడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మైనింగ్ స్టాఫ్ తమ డిమాండ్లపై మెమోరాండం సమర్పించేందుకు సింగరేణి ప్రధాన కార్యాలయానికి వచ్చిన సందర్భంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులను మోహరించడం, కార్యాలయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని ఆయన విమర్శించారు. చంచల్‌గూడ జైలు గేట్ల మాదిరిగా కార్యాలయ ప్రవేశ ద్వారాలను మూసివేసి ఉద్యోగులను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఇది పూర్తిగా పారిశ్రామిక వివాదమని, దానిని శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించి ఉద్యోగుల హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కోల్ ఇండియాలో అమలవుతున్న విధానాలను ఉదాహరణగా ప్రస్తావించిన ఆయన, స్టాట్యుటరీ సర్టిఫికెట్ సాధించిన రోజునే ఉద్యోగులకు సంబంధిత హోదాలు కల్పిస్తున్నారని తెలిపారు. సూపర్‌వైజర్ అర్హత సాధిస్తే సూపర్‌వైజర్‌గా, ఓవర్‌మెన్ అర్హత సాధిస్తే ఓవర్‌మెన్‌గా, అండర్ మేనేజర్ అర్హత పొందితే అండర్ మేనేజర్‌గా వెంటనే నియమిస్తున్నారని చెప్పారు. అలాంటి విధానం సింగరేణిలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. డిప్యూటీ మేనేజర్ హోదాలకు సంబంధించి గ్రేడ్‌లు మంజూరు చేస్తున్నప్పుడు, మైనింగ్ స్టాఫ్ విషయంలో మాత్రం వివక్ష చూపడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కోల్ ఇండియా, సింగరేణి రెండూ ఒకే రంగానికి చెందిన సంస్థలేనని, అయితే ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో భిన్న విధానాలు పాటించడం వెనుక గతంలో కొన్ని సంఘాలు చేసుకున్న ఒప్పందాలే కారణమని ఆరోపించారు. తమ సమస్యలపై మెమోరాండం ఇవ్వడానికి వచ్చిన ఉద్యోగులను “పిక్నిక్‌కు వచ్చినట్టున్నారు” అన్నట్లుగా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యలను తేలికగా తీసుకోకుండా పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. సింగరేణిలో గెలిచిన గుర్తింపు సంఘాలు ఉద్యోగుల క్యాడర్ స్కీమ్‌లను మార్చి కోల్ ఇండియాకు మించిన ప్రయోజనాలు సాధించాల్సి ఉండగా, ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు. అందువల్ల మైనింగ్ స్టాఫ్ తమను గతంలో మోసం చేసిన సంఘాలను నమ్మకుండా హెచ్‌ఎంఎస్‌ను ఆశ్రయించాలని పిలుపునిచ్చారు. మైనింగ్ స్టాఫ్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి హెచ్‌ఎంఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన రియాజ్ అహ్మద్, యాజమాన్యం వెంటనే అర్హులైన ఉద్యోగులందరికీ ఓవర్‌మెన్ ప్రమోషన్ లేఖలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా ప్రమోషన్లు మంజూరు చేసి, తర్వాత విధులు, బాధ్యతల అంశాలపై చర్చించవచ్చని సూచించారు. దూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఉద్యోగులను బెదిరించడం, పోలీసులను ఉపయోగించడం మానుకుని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.