

పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి : కలెక్టర్ రాహుల్ శర్మ
చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూన్ 28:చిన్నారులు పోలియో మహమ్మారి బారినపడకుండా కాపాడేందుకు ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల 34,728 మంది చిన్నారులను గుర్తించి వారికి పోలియో చుక్కలు అందించేందుకు 296 పోలియో బూత్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కోసం 14 మొబైల్ బృందాలు, 14 ట్రాన్సిట్ బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు 1,184 మంది వైద్య సిబ్బందిని విధుల్లో నియమించినట్లు చెప్పారు. అలాగే హైరిస్క్‌గా గుర్తించిన 25 ప్రాంతాల్లోని 137 మంది చిన్నారులకు ప్రత్యేకంగా టీకాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఏదైనా అనివార్య కారణాలతో పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారుల కోసం జూన్ 29, 30 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి మిగిలిన పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఒక్క చిన్నారి కూడా మిగలకుండా నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చొరవ చూపాలని, చిన్నారుల ఆరోగ్యమే దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి పిల్లలను రక్షించేందుకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేసి నూరు శాతం పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.