కాలనీ రోడ్లు, పార్కు అభివృద్ధికి వినతిపత్రం.
ఉప్పల్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కార్తికేయ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఘట్కేసర్, జూన్ 30: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఉన్న కార్తికేయ ఎన్క్లేవ్ కాలనీలో రోడ్ల నిర్మాణం, పార్కు అభివృద్ధి పనులను చేపట్టాలని కోరుతూ కార్తికేయ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తాను సోమవారం ఉప్పల్ జోనల్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు దడిగే సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గుమ్మడి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలోని అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో ప్రజలు నిత్యం రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీ పరిధిలో సుమారు 1000 మీటర్ల పొడవునా, 18 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా కాలనీ ప్రధాన ద్వారం నుంచి గణేష్ మండపం వరకు కనీసం 300 మీటర్ల మేర సెంట్రల్ లైన్ రోడ్డు నిర్మాణం అత్యవసరమని వివరించారు. అదేవిధంగా కాలనీలో ఒక ఎకరానికి పైగా విస్తీర్ణంలో ఉన్న పార్కును క్రమం తప్పకుండా శుభ్రపరచడం, నిర్వహణ చేపట్టడం, అదనపు మొక్కలు నాటడం ద్వారా పార్కును మరింత అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పార్కును కాలనీలోని వృద్ధులు, మహిళలు, పిల్లలు వాకింగ్ మరియు వినోద కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నందున తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. వినతిపత్రాలను స్వీకరించిన జోనల్ కమిషనర్ రాధికా గుప్తా సమస్యలపై సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పనులు త్వరలో ప్రారంభమవుతాయని కాలనీ వాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రాంరెడ్డి, సద్గుణాచారి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.