Take a fresh look at your lifestyle.

గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం ఆలయ పునరుద్ధరణ పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి.

0 26

గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం ఆలయ పునరుద్ధరణ పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి.

– పుష్కరాలకు 15 రోజుల ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశం.
– పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నియామకం.. ప్రతి 10 రోజులకు సమీక్ష.
– భక్తులకు అసౌకర్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని సూచన.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 19:వచ్చే గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు కనీసం 15 రోజుల ముందే అన్ని పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ఆలయ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించి ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించాలని సూచించారు.ఆదివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు  వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, దేవస్థానం ఈవో దామోదర్ రావు తదితరులతో కలిసి ఆలయంలో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులు మ్యాప్‌ల ద్వారా పనుల పురోగతిని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునరుద్ధరణ కోసం రూ.351 కోట్లు మంజూరు చేయడంతో పాటు అభివృద్ధి, విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం సుమారు రూ.75 కోట్లు వెచ్చించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ పనులను గోదావరి పుష్కరాల నాటికి పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆలయ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆగమశాస్త్రాలకు అనుగుణంగా, ప్రాచీన వైభవానికి భంగం కలగకుండా పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గోపురాలు, పురాతన నిర్మాణాల నాణ్యతను నిపుణులతో పరిశీలిస్తూ పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నూతన స్నాన ఘాట్ల నిర్మాణం, యాత్రికుల వసతుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి సౌకర్యాల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని వెంటనే నియమించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు టెలిఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని పరిశీలించాలని సూచించారు. పుష్కరాలకు 15 రోజుల ముందే అన్ని పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాలని, ఒకవైపు పనులు పూర్తిచేస్తూనే మరోవైపు కొత్త పనులు చేపట్టే విధంగా కార్యాచరణ అమలు చేయాలని పేర్కొన్నారు. ఉత్తర భాగంలో చేపట్టాల్సిన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే ప్రస్తుతం ఉన్న కార్మికుల కంటే 25 శాతం అదనంగా కార్మికులను నియమించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. డ్రాయింగ్‌లు, డిజైన్‌లు, సాంకేతిక అనుమతుల్లో జాప్యం లేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని, రిటైనింగ్ వాల్స్, కాంక్రీట్ నిర్మాణాలు, రాతి శిల్పకళా పనులను నాణ్యతా ప్రమాణాలతో, అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలోనే పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ఆలయ పునరుద్ధరణ పనులకు అవసరమైన ఇసుకతో పాటు ఇతర నిర్మాణ సామగ్రి సకాలంలో అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆర్కిటెక్ట్ మూర్తి, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.