Take a fresh look at your lifestyle.

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ హెచ్చరిక : కేంద్రానికి నివేదిక పంపి సహాయం కోరుతాం – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

0 5

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ హెచ్చరిక.

ఉమ్మడి జిల్లాకో ప్రత్యేక అధికారి.. ముందస్తు కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధం.

కేంద్రానికి నివేదిక పంపి సహాయం కోరుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హనుమకొండ, జూలై 21:ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో సిద్ధంగా ఉందని, ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని వెల్లడించారు. మంగళవారం హనుమకొండ ఐడీఓసీ కలెక్టరేట్‌లో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ముందస్తు కార్యాచరణ, కంటింజెన్సీ ప్రణాళికలు, వివిధ శాఖల సంసిద్ధతపై సహచర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నామని చెప్పారు. ఆయా జిల్లాల్లో వ్యవసాయం, తాగునీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితి, వర్షాభావ ప్రభావం వంటి అంశాలపై వారు సమగ్ర నివేదికలు రూపొందించి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గానికి అందజేస్తారని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి దేవసేనను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు వెల్లడించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైతులకు భరోసా కల్పించడం, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం, ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు అమలు చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని మంత్రి తెలిపారు. పరిస్థితులపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని కోరనున్నట్లు చెప్పారు. రైతులు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్ర నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, మురళీ నాయక్, ప్రత్యేక అధికారి దేవసేన, ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కేవీకే–ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.