యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి : భద్రాద్రి జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి ఎం. పరంధామరెడ్డి.

యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి.
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి ఎం. పరంధామరెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మినీ స్టేడియంలో జిల్లా ఎన్‌సీసీ యూనిట్, జిల్లా యువజన మరియు క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది యువత, క్రీడాకారులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగా సాధన చేశారు. యోగా నిపుణుల పర్యవేక్షణలో వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన ప్రక్రియలు నిర్వహించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా కీలకమని పాల్గొన్న వారికి వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి ఎం. పరంధామరెడ్డి మాట్లాడుతూ, యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఎన్‌సీసీ జిల్లా కో-ఆర్డినేటర్, టిటిడబ్ల్యూఆర్‌జేసీ కొత్తగూడెం ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సాంస్కృతిక వారసత్వమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందని, క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వంతో పాటు వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. ఎన్‌సీసీ 11వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ ఎస్.కె. భద్రా మాట్లాడుతూ యోగాను కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజూ ఆచరించాలని సూచించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవరుచుకోవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిటిడబ్ల్యూఆర్‌జేసీ కొత్తగూడెం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ, డీఏవీ నవభారత్, ఓబీపీఎస్, కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్, సింగరేణి విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే కేటీపీఎస్, ఏడీఈ, ఎన్‌సీసీ అధికారులు, వైద్య నిపుణులు, క్రీడా కోచ్‌లు కళ్యాణ్, డేనియల్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.