Take a fresh look at your lifestyle.

విద్య ద్వారానే సామాజిక వికాసం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

0 2

విద్య ద్వారానే సామాజిక వికాసం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
క్యాలెండర్ ప్రకారం నిర్మాణాలు పూర్తి చేయాలి.
బోనకల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, ఆగస్టు 15: విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, సామాజిక వికాసం సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అక్షరమే ఆయుధంగా తెలంగాణ బిడ్డలు ఉన్నతంగా ఎదగాలని, విద్యతోనే కుల, మత, వర్గ, ప్రాంత, ఆర్థిక అంతరాలు లేని సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం, అలసత్వం ఉండకూడదని గుత్తేదారులు, అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. పనులను మరింత వేగవంతం చేసేందుకు నిర్మాణ కార్మికుల సంఖ్యను పెంచాలని సూచించారు. తరగతి గదులు, హాస్టల్ సముదాయాలు, సైన్స్, కంప్యూటర్ తదితర ల్యాబ్ భవనాలను పరిశీలించారు. కిచెన్, డైనింగ్ హాల్ నిర్మాణ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూనియర్ హాస్టళ్ల విభాగంలో నిర్మించాల్సిన నాలుగు భవనాల్లో ఇప్పటికే మూడు పూర్తయ్యాయని అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మిగిలిన నిర్మాణాలను కూడా నిర్ణీత క్యాలెండర్ ప్రకారం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కుల, మత, వర్గ, ప్రాంత, ధనిక, పేద అనే తేడాలు లేకుండా అందరూ ఒకే చోట విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో యంగ్ ఇండియా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకుంటే వారిలో వసుధైక కుటుంబ భావన పెంపొందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్‌రావు, పీఆర్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.