

సింగరేణిని కాపాడుకుంటూ.. లాభాల బాటలో నడిపిస్తాం.
బొగ్గుకే పరిమితం కాకుండా బంగారం, లిథియం, కీలక ఖనిజాల మైనింగ్‌లోకి అడుగులు.
బీఎస్‌ఎన్‌ఎల్‌లా మారకుండా సింగరేణికి ఉజ్వల భవిష్యత్తు.
ఎన్‌టీపీసీ స్థాయిలో సింగరేణిని నిలబెట్టడమే ప్రభుత్వ ధ్యేయం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
భట్టి నాయకత్వంలో సింగరేణి మరింత బలోపేతం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణకు ఆత్మలాంటి అత్యుత్తమ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలకు లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా కాలానుగుణంగా కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల మైనింగ్‌లోకి సింగరేణిని తీసుకెళ్తున్నామని తెలిపారు. సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్త బొగ్గు బ్లాక్‌లు సాధించడంలో సహకరిస్తున్న భట్టి విక్రమార్కను సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య, అధికార సంఘాల నాయకులు సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాక్‌లు తీసుకోకపోవడం, ఉన్న గనులను మూసివేయడం వల్ల సింగరేణికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. మరో ఐదారు సంవత్సరాల్లో సంస్థ మూతపడే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సహచరులతో కలిసి నైని బొగ్గు బ్లాక్‌ను సాధించామని తెలిపారు.
కీలక బొగ్గు బ్లాక్‌ల సాధన:
2013లో యూపీఏ ప్రభుత్వం సింగరేణికి రీ-అసైన్ చేసిన తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు దక్కేలా కేంద్రంతో చర్చించి ప్రభుత్వం విజయం సాధించిందని భట్టి తెలిపారు. జెన్‌కోను ఒప్పించి మణుగూరు డిప్‌సైడ్-2 బ్లాక్‌ను వేలంలో సింగరేణి దక్కించుకునేలా కృషి చేశామన్నారు. ఒడిశాలోని నైని బ్లాక్ సమస్యల పరిష్కారానికి స్వయంగా వెళ్లి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో చర్చించి మార్గం సుగమం చేశామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సోలార్, విండ్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో థర్మల్ పవర్, బొగ్గు వినియోగం తగ్గే అవకాశం ఉందని భట్టి పేర్కొన్నారు. కేవలం బొగ్గుపైనే ఆధారపడితే సింగరేణి కూడా ఒకప్పటి బీఎస్‌ఎన్‌ఎల్‌లా వెనుకబడిపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే ప్రపంచ మార్పులకు అనుగుణంగా కీలక ఖనిజాల మైనింగ్ వైపు సంస్థను మళ్లిస్తున్నామని తెలిపారు. కీలక ఖనిజాల అంతర్జాతీయ అవకాశాలను అధ్యయనం చేసేందుకు దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, చిలీ తదితర దేశాల్లో అధ్యయనం కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమించినట్లు వెల్లడించారు. ఇప్పటికే కర్ణాటకలోని గోల్డ్ మైన్ వేలంలో సింగరేణి పాల్గొని విజయం సాధించిందని, భవిష్యత్తులో అక్కడ మైనింగ్ చేపడితే సంస్థకు నిరంతరం రాయల్టీ, ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సింగరేణిలో 43 వేల నుంచి 45 వేల మంది శాశ్వత ఉద్యోగులు, మరో 30 వేల మంది కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మైనింగ్ బ్లాక్‌లు అందుబాటులో ఉన్నా వాటిని దక్కించుకునే దిశగా సింగరేణి ముందుకు సాగాలని సూచించారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణిని అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని భట్టి స్పష్టం చేశారు.
సింగరేణికి పూర్తి సహకారం:
సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమర్థవంతమైన, డైనమిక్ నాయకత్వంలో సింగరేణి కొత్త గనుల ప్రారంభం, వ్యాపార విస్తరణ, నూతన ప్రాజెక్టులతో శరవేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. భవిష్యత్తులో సింగరేణిని దేశంలోని అత్యుత్తమ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటిగా నిలిపేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. సింగరేణి తెలంగాణ ప్రజలందరూ గర్వపడాల్సిన ప్రతిష్టాత్మక సంస్థ అని పేర్కొన్నారు.
భట్టి కృషితో కీలక విజయాలు:
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రాతినిధ్య కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ, సింగరేణి కోసం నైని బొగ్గు బ్లాక్ సాధనలో భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ చూపారని కొనియాడారు. ఆయన ఒడిశాకు వెళ్లి ముఖ్యమంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో చర్చించి అనుమతులు సాధించారని తెలిపారు. ఆయన కృషి ఫలితంగా గత ఏడాది నైని బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తి ప్రారంభమైందని, రాష్ట్ర ఇంధన అవసరాల కోసం ఈ నెలలో తొలి బొగ్గు రేకును సింగరేణికి రవాణా చేయడం సాధ్యమైందన్నారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు సాధించడంలోనూ భట్టి ప్రత్యేక కృషి చేశారని తెలిపారు. గతంలో బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా సింగరేణిని అడ్డుకోవడం వల్ల రెండు కీలక గనులను సంస్థ కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వేలంలో పాల్గొనేందుకు సింగరేణికి అనుమతి ఇవ్వడంతో మణుగూరు డిప్‌సైడ్-2 బ్లాక్‌ను సంస్థ దక్కించుకుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తికి పరిమితమైన సింగరేణిని కీలక ఖనిజాల రంగంలోకి తీసుకెళ్లి అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కర్ణాటకలో బంగారం, రాగి ఖనిజ అన్వేషణ లైసెన్స్ సాధించడం కూడా మరో విజయమని పేర్కొన్నారు. కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు. కాంట్రాక్టు కార్మికులకు బోనస్ పంపిణీ చారిత్రాత్మకమని, డిపెండెంట్ ఉద్యోగాల్లో గరిష్ట వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచడం ద్వారా వందలాది మంది లబ్ధి పొందారని తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్, ప్రాతినిధ్య కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి, కేంద్ర నాయకులు పసునూటి రాజేందర్, జోగ బుచ్చయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్, కార్యదర్శి పెద్ది నర్సింహులు, భూపాలపల్లి ఏరియా ఏఐటియుసి నాయకులు మోటపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ నాయకులు బేతెల్లి మధూకర్ రెడ్డిలతో పాటు అన్ని ఏరియాలకు చెందిన గుర్తింపు, ప్రాతినిధ్య, అధికార సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.