జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు భద్రాద్రి జిల్లా క్రీడాకారుల ఎంపిక.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భావన, శ్రీరామ్ ప్రతిభ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, సెప్టెంబర్ 8: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా షూటింగ్ క్రీడకు మరో ఘనత లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జిల్లా క్రీడాకారులు గరిడేపల్లి భావన బాలికల విభాగంలో, కొమరోజు శ్రీరామ్ బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ వివరాలను జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి మంగళవారం మీడియాకు తెలిపారు. కేరళలోని తిరువనంతపురంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహిస్తున్న సౌత్‌జోన్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్-2026 అర్హత పోటీల్లో వీరిద్దరూ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. కోచ్ ఎం.డి. అబ్దుల్ నబి మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో కూడిన శిక్షణ, నిరంతర సాధనతో ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. జాతీయస్థాయి పోటీలు డిసెంబర్‌లో డెహ్రాడూన్ షూటింగ్ రేంజ్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయస్థాయిలోనూ భావన, శ్రీరామ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాభిమానులు ఆకాంక్షించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం. పరంధామరెడ్డి క్రీడాకారులు భావన, శ్రీరామ్‌తో పాటు కోచ్ ఎం.డి. అబ్దుల్ నబిని అభినందించారు. జాతీయస్థాయిలో మరింత రాణించి జిల్లాకు ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, తోటి క్రీడాకారులు కూడా అభినందనలు తెలిపారు.