
బొగ్గుగనుల ఉద్యోగులకు రూ.1,10,250 పీఎల్‌ఆర్ బోనస్.
2026 సంవత్సరానికి బోనస్‌పై అపెక్స్ జేసీసీలో ఒప్పందం.
దాదాపు 2.37 లక్షల మంది నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు ప్రయోజనం
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, అక్టోబర్ 3: దేశంలోని బొగ్గుగనుల ఉద్యోగులకు 2025-26 సంవత్సరానికి పీఎల్‌ఆర్ (పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్)గా రూ.1,10,250 చెల్లించేందుకు శనివారం జరిగిన అపెక్స్ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ (జేసీసీ) సమావేశంలో ఒప్పందం కుదిరింది. కోల్ ఇండియా ఛైర్మన్ బి. సాయిరామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించి ఈ మొత్తానికి అంగీకరించినట్లు సమాచారం. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశంలో తొలుత వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన కోడ్-2020పై యాజమాన్యం ప్రజెంటేషన్ ఇచ్చింది. అనంతరం సంబంధిత నిబంధనలు, కార్మికుల భద్రత, పని పరిస్థితులకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం తిరిగి ప్రారంభమై పీఎల్‌ఆర్ మొత్తంపై యూనియన్ ప్రతినిధులు, యాజమాన్యం మధ్య చర్చలు జరిగాయి. పీఎల్‌ఆర్‌పై జరిగిన చర్చల్లో యూనియన్ ప్రతినిధులు రూ.1.20 లక్షలు డిమాండ్ చేయగా, యాజమాన్యం తొలుత రూ.1.08 లక్షలు ప్రతిపాదించినట్లు సమాచారం. అనంతరం ఇరుపక్షాలు తమ ప్రతిపాదనలను సవరించుకుంటూ చర్చలు కొనసాగించాయి. చివరకు రూ.1,10,250 పీఎల్‌ఆర్‌గా చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఈ సమావేశంలో బీఎంఎస్ తరఫున కె. లక్ష్మారెడ్డి, హెచ్‌ఎంఎస్ తరఫున హర్భజన్ సింగ్ సిధు, సీఐటీయూ తరఫున డి.డి. రామానందన్, ఏఐటీయూసీ తరఫున లఖన్‌లాల్ మహతో పాల్గొన్నారు. యాజమాన్యం తరఫున మార్కెటింగ్ డైరెక్టర్, మానవ వనరుల ఇన్‌చార్జి ముఖేష్ చౌదరి, ఫైనాన్స్ డైరెక్టర్ ముఖేష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1, 2026 నాటికి కోల్ ఇండియాలో 1,96,753 మంది నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు సింగరేణిలోని దాదాపు 38 వేల మంది ఉద్యోగులకు కూడా పీఎల్‌ఆర్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. నిబంధనల ప్రకారం అర్హులైన పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనం వర్తించనుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య పదవీ విరమణ చేసిన సుమారు 8,351 మంది బొగ్గు కార్మికులు కూడా పీఎల్‌ఆర్ పొందే అవకాశం ఉంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లోని సుమారు 38 వేల మంది ఉద్యోగులకు కూడా పీఎల్‌ఆర్ ప్రయోజనం అందుబాటులో ఉంది. కాగా, పీఎల్‌ఆర్ చర్చల్లో తమ ప్రతినిధిని చేర్చాలని కోరుతూ ఐఎన్టీయూసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అయితే శనివారం జరిగిన సమావేశానికి సంబంధించి ఐఎన్టీయూసీ పిటిషన్ విచారణకు జాబితా కాలేదని సమాచారం. పీఎల్‌ఆర్ ఒప్పందంపై బీఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. బీఎంఎస్ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్‌చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. నాలుగు జాతీయ కార్మిక సంఘాలు ఏకగ్రీవంగా రూ.1,10,250 పీఎల్‌ఆర్‌కు అంగీకరించాయని పేర్కొన్నారు. కార్మికుల ఐక్యత, బీఎంఎస్ నిరంతర కృషితోనే ఈ ఒప్పందం సాధ్యమైందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ మంద నరసింహారావు, ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కూడా పీఎల్‌ఆర్ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు.