భూపాలపల్లిలో కార్మిక సంఘాల కార్యాలయాలను తొలగించవద్దు : ఐఎఫ్టీయూ.
రోడ్డు అలైన్‌మెంట్ మార్చి కార్మిక సంఘాల భవనాలను కాపాడాలి.
అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కార్మిక సంఘాల కార్యాలయాల తొలగింపునే వ్యతిరేకిస్తున్నాం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, అక్టోబర్ 11: భూపాలపల్లి పట్టణంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనుల పేరుతో కార్మిక సంఘాల కార్యాలయాలను తొలగించే ప్రయత్నాలను సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఐఎఫ్టీయూ అనుబంధ గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐ. కృష్ణ డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని, అయితే కార్మికుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కేంద్రాలుగా ఉన్న సంఘాల కార్యాలయాలకు నష్టం కలగకుండా రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చాలని కోరారు. ఆదివారం గోదావరిఖనిలోని గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఐ. కృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సింగరేణి తెలంగాణ ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి బొమ్మ సెంటర్ వద్ద గత ప్రభుత్వం, అప్పటి సింగరేణి యాజమాన్యం కేటాయించిన స్థలంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకున్నట్లు వివరించారు. కార్మికులు తమ సమస్యలు, ఇబ్బందులను నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, వాటి పరిష్కారం కోసం చర్చించేందుకు ఈ కార్యాలయం కీలక కేంద్రంగా ఉందన్నారు. అలాంటి కార్యాలయాన్ని రోడ్డు విస్తరణ పేరుతో తొలగించాలనుకోవడం కార్మిక సంఘాల కార్యకలాపాలకు ఆటంకం కలిగించడమేనని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో సకల జనుల సమ్మెతోపాటు రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి ఉద్యోగుల సంఘం ఇతర కార్మిక సంఘాలతో కలిసి చురుకుగా పాల్గొని కీలక పాత్ర పోషించిందని కృష్ణ గుర్తుచేశారు. ఈ సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ కోదండరాం కొనసాగుతున్నారని తెలిపారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే సంఘాల కార్యాలయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, సింగరేణి యాజమాన్యంపై ఉందన్నారు. భూపాలపల్లి అభివృద్ధి కోసం చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం కలగకుండా, అదే సమయంలో కార్మిక సంఘాల కార్యాలయాలకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలని సూచించారు. ప్రస్తుతం నిర్ణయించిన అలైన్‌మెంట్‌ను మార్చి కార్యాలయాల జోలికి వెళ్లకుండా రోడ్డు విస్తరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పేరుతో సుదీర్ఘకాలంగా కార్మికుల కోసం పనిచేస్తున్న సంఘాల కార్యాలయాలను తొలగించడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ. నరేష్, నాయకులు ఈ. రామకృష్ణ, తోకల రమేష్, పొగుల శేఖర్, ఇర్ఫాన్, కాశిపేట ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.