ప్రైవేట్ పాఠశాలల తీరు మారదా..?
— తల్లిదండ్రుల ఆవేదన
— ఆన్లైన్ అనుసంధానంతో నైనా పరిస్థితులు మారేనా..?
ఉమ్మడి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 8 (లోకంతీరు) : ఉమ్మడి జిల్లాలలో హద్దు అదుపు లేకుండా కార్పొరేట్ స్కూల్ లకు ఏమాత్రం తగ్గని విధంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ‘లక్ష’ణంగా ఫీజు అధిక మొత్తంగా వసూలు చేస్తున్నాయి. మౌలిక వసతులు అంతంతే ఉన్న ఫీజుల్లో మాత్రం తగ్గడం లేదు ప్రత్యేక నైపుణ్యాల శిక్షణ పేరిట అదనపు రుసుములు వసూలు చేస్తున్నారు. క్రీడలు ఇతర వృత్తి విద్యా వికాసం ముసుగులో స్పెషల్ త్రిబుల్ ఐటీ కోర్స్ పేరిట వేలాది ఫీజు, వేలాది రూపాయలను ఎంచక్కా అడిగేస్తున్నారు. దీన్ని యాక్టివిటీ ఫీజు కింద లెక్కేస్తున్నారు. ప్రవేశ రుసుముల పేరిట ప్రతి విద్యా సంవత్సరంలో కొత్త మోతను విద్యార్థుల నెత్తిన రుద్దుతు నిబంధనలకు విరుద్ధంగా వీటిని అమలు చేస్తున్నారు.విడతలవారీగా చెల్లించాల్సిన ఫీజులు ఏమాత్రం ఆలస్యమైన యూనిట్ పరీక్షల సమయంలోనూ తోటి విద్యార్థుల ముందే ప్రస్తావిస్తున్నారు. నాణ్యమైన విద్యా రూపంలో ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని ఆరాటంతో చిరు ఉద్యోగులు ఆదాయం తక్కువ ఉన్నవారు పిల్లల్ని చేర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడైనా ఫీజు చెల్లింపు ఆలస్యం అయితే చిన్నారులను అందరి ముందే ఫీజులు అడగడం పసి మనసులపై ప్రభావం చూపెడుతుంది? . ఇది గాక ఒక పాఠశాల మరో అడుగు ముందు కేసి ఫీజు చెల్లింపుల్లో జాప్యం జరిగినట్లయితే రెండు శాతం ఇంట్రెస్ట్ తో వసూలు చేస్తామని చెప్పడం విడ్డూరం.
సామాన్య మధ్య తరగతి వర్గాల పిల్లలకు ప్రైవేటు బడుల్లో చదువు మరింత ఖరీదువు తోంది సర్కార్ బడులను కాదని అక్కడ చేర్పించే పిల్లలకు చెల్లించే ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతున్నాయి.ఏ ఏటికాయేడు పెరుగుతున్న రుసుములతో ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఉమ్మడి మండల వ్యాప్తంగా సుమారు చాలా ప్రైవేట్ బడుల్లో వేల మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. ప్రతి సంవత్సరం 10 శాతానికి మించిన ఫీజును పెంచరాదని ప్రభుత్వం సిఫారసు చేసింది కానీ చాలా విద్యాలయాల్లో ఆ విషయమే పట్టించుకోవడం లేదు.
పర్యవేక్షణ పెంచితే మేలు
ఎప్పటికప్పుడు ప్రైవేటు విద్యాలయాల స్థితిగతుల పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యమే కనిపిస్తోంది.
ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అడపాదడపా అందుతున్న అధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలు ఉండడం లేదు.
దీంతో కొన్ని బడులు తమ పంథా వేరనే విధంగా వేలాది రూపాయల ను ప్రతి విద్యా సంవత్సరంలో పెంచుకుంటూ పోతున్నాయి ఏటా 10 శాతం నిబంధన ఎక్కడ అమలవ్వకపోగా 15 నుంచి 20 శాతం పెంచిన వాటి సంఖ్య ఎక్కువగానే ఉండటం గమనార్హం. మౌలిక వసతులు సహా ఇతర సౌకర్యాలు సరిగ్గా లేనిబడుల్లోనే అర లక్ష వరకు వసూలు చేస్తున్నారు. భవనాల హంగులు,ఇతర ఆర్భాటాలను చూపిస్తున్న వాటి చెంతన ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులు కలిపి అర లక్షకు పైగా రుసుమును ఒక్కో విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి ప్రస్తుతం విద్యాశాఖ ఈ ఫీజుల విషయంలో ఆన్లైన్లో అనుసంధించాలని ప్రతిపాదన ఆచరణకు నోచుకుంటే చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులకు మేలు జరగనుంది. అందే విద్యకు తీసుకుంటున్న డబ్బులకు పొంతన కుదిరే వీలుంటుంది. ఈ దిశగా త్వరితగతిన చర్యలు కనిపించాలని ఆరాటం తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని పలు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.