కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్
– బిజెపి విధానాలపైన గర్జించిన కార్మిక వర్గం
– రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్
– కేంద్ర బిజెపి కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం..!
– మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై మండి పడ్డారు.?

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 16 ( లోకంతీరు ) : 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్ జరిగింది.కార్మిక, కర్షక కార్యక్రమం విజయవంతం చేశారు.కేంద్ర బిజెపి కార్పొరేట్, మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జీషీట్ ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాల ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్ చేయాలని, 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాయింట్ ప్లాట్ఫారమ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లు మరియు సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత స్థాయిలో నిర్ణయించాయి. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సమ్మె-గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని,కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారానికొచ్చి 10 సంవత్సరాలు పూర్తైంది. ఐనా రైతాంగ, కార్మికవర్గ, ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. భారత్ వెలిగిపోతుంది. అచ్చాదిన్ ఆయేగా, విశ్వగురు, ఆత్మనిర్బర్ భారత్, మేకిన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలిచ్చినా ఏమీ ఒరగలేదు. బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చారు. నేడు ఉద్యోగ కల్పన పడిపోయింది. నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. శ్రామికుల నిజ వేతనాలు 20 శాతం తగ్గిపోయాయి. ప్రపంచంలోని 125 దేశాల్లో ఆకలిలో భారత్ 111వ స్థానంలో ఉంది. మానవాభివృద్ధిలో 191 దేశాల్లో ఇండియా 132వ స్థానంలో ఉంది. హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం సంతోష జీవన సూచీ 2023 ప్రకారం 180 దేశాల్లో భారత్ 160 స్థానంలో ఉంది. బిజెపి నరేంద్రమోడీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్టస్థాయికి చేరాయి. 2023లో పాలకులు కార్పొరేట్లకు 2.14 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారు. 2019 2022 మధ్యకాలంలో 1 శాతంగా ఉన్న బడా కార్పోరేట్ల వాస్తవ ఆదాయం 30 శాతం వృద్ధి చెందగా, పేదల వాస్తవ ఆదాయం 11 శాతం పడిపోయింది. ధరలను నియంత్రిస్తామని వాగ్దానం చేసిన బిజెపి ప్రభుత్వ హయాంలోనే ధరలు కనీవినీ ఎరుగని రీతిలో 30 నుండి 56 శాతం వరకు పెరిగాయి. పెట్రోలు ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం పన్నుల వాటాను 243 శాతానికి పెంచింది. ఉద్యోగాలు అందుబాటులో లేనందున స్వయం ఉపాధిలో సరైన వేతనం లేని కార్మిక కుటుంబాలు పెరుగుతున్నాయి. స్విస్ బ్యాంకు నుండి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదవారి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామన్న మాటను మర్చిపోయారు. మోడీ విధానాల వల్ల మధ్య తరగతి ప్రజల జీవితాలు అతుకుల బతుకులుగా మారాయి.
ప్రభుత్వరంగ సంస్థలు, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తున్నది. వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థల్లో 100 శాతం వాటాలు తెగనమ్ముతున్నది. నేషనల్ మానిటైజేషన్ పైడ్లైన్ (ఎన్ఎంపి) పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రైవేటీకరిస్తున్నది. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు కట్టబెడుతున్నది. సింగరేణిలోని 4 బొగ్గు గనులను వేలం వేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది. కార్మికులు, మధ్యతరగతి ప్రజల్లో అత్యధీకులు పాలసీదార్లుగా వున్న ఎలిసి వాటాలను అమ్మేందుకు తెగబడింది. కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలతో ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నది. ఈ విధానాలు ఉద్యోగుల భద్రతతో పాటు దేశ ఆర్ధిక స్వావలంబనకే ముప్పు తెస్తున్నాయి. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చింది. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికింది. సమ్మె హక్కును కాలరాస్తున్నది. పిఎఫ్, ఇఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తున్నది. తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తెస్తున్నది. కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెంచి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నది. కనీస వేతనం నెలకు రూ.26,000/-లు నిర్ణయించేందుకు బిజెపి ప్రభుత్వం అంగీకరించటం లేదు. కోట్లాది మంది కార్మికులకు వర్తించే ఇపిఎస్ పెన్షన్ నెలకు రూ.10,000/-లకు పెంపు, సిపిఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ (ఓపిఎస్)ను పునరుద్ధరణను వ్యతిరేకిస్తున్నది. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 8వ పే కమిషన్ను నియమించకుండా జాప్యం చేస్తున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో కొద్దోగొప్పో ఉపాధి దొరుకుతుందంటే అది ప్రజా పోరాటాలతో పాటు పార్లమెంట్లో వామపక్షాల కృషి వల్ల వచ్చిన ఉపాధి హామీ పథకం వల్లనే. ఈ పథకాన్ని కూడా ఎత్తివేయాలని బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. కూలీలకు జీవనాధారంగా ఉన్న ఈ పథకానికి బడ్జెట్ తగ్గించారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించేందుకు నిరాకరిస్తున్నారు. ప్రతి వ్యక్తికి 200 రోజుల పని, రూ. 600/-లు రోజువారీ వేతనం ఇవ్వాలన్న డిమాండ్ను ఖాతరు చేయడం లేదు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల ప్రజల కోసం 40 సంవత్సరావల నుండి కొనసాగుతున్న స్కీమ్లను బలోపేతం చేయడం లేదు. దేశంలో సుమారు కోటి మంది పనిచేస్తున్న కేంద్ర స్కీములకు ప్రభుత్వం నిధుల్లో కోత పెట్టింది. ఐఎస్ఓ తీర్మానం ప్రకారం వీరిని కార్మికులుగా గుర్తించడం, కనీస వేతనాలు చెల్లించడం, పిఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. వీటిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంబాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నది.
2014లో స్వామినాధన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులు పండించిన పంటకు ఎంఎస్పి (మినిమం సపోర్ట్ ప్రైస్) చెల్లిస్తామన్న హామీని బిజెపి ప్రభుత్వం నిలబట్టుకోలేదు. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఎసి 2 + 50% ఉండేలా చట్టబద్ధత కల్పించాలని, కేరళ తరహా రుణవిమోచన చట్టం తీసుకురావాలని, అన్ని బ్యాంకింగ్ సంస్థల నుండి ఒకేసారి రుణమాఫీ చేయాలని, విద్యుత్ (సవరణ) చట్టం ద్వారా విద్యుత్ రంగ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, 3 రైతు చట్టాల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సుదీర్ఘ కాలంగా సంయుక్త కిసాన్ మోర్చా చేస్తున్న డిమాండ్ను పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ అనుకూల, నయా ఉదారవాద ఎజెండాను దూకుడుగా ముందుకు తీసుకెళ్తూనే కార్పొరేట్, మతోన్మాద శక్తుల వైఫల్యాలు, ప్రజల రోజువారీ సమస్యలను దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తమకు వ్యతిరేకంగా గొంతెత్తిన ప్రతిపక్షాలను, ఉద్యమకారులను అణిచివేస్తున్నది. సిబిఐ, ఈడీ, ఐటి వంటి సంస్థలను వారి జేబు సంస్థలుగా ఉపయోగించుకొని వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తున్నది. ప్రశ్నించే మీడియాను లొంగదీసుకుని అణచివేస్తున్నది. హక్కులకై పోరాడే వారిపై నిర్బంధం ప్రయోగిస్తూ ఉపా లాంటి చట్టాలను ప్రయోగించి నిర్బంధిస్తున్నారు.
భారత రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచిన లౌకికవాదాన్ని తారుమారు చేస్తూ హిందూ రాజ్యస్థాపన లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ తన ఎజెండాను ముందుకు తీసుకెళ్తుంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, ఆకలి మొదలైన కీలక అంశాలను ప్రజల దృష్టి నుండి మరల్చడానికి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని మతతత్త్వ శక్తులు ఇప్పుడు రామాలయ ప్రారంభోత్సవం, అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చాయి. ఈ కార్యక్రమాన్ని ఒక మతం వారు జరుపుకునే కార్యక్రమంగా కాకుండా, ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నది. రాజ్యాంగానికి, లౌకిక విలువలకు తిలోదకాలిస్తూ | మొత్తం ప్రభుత్వ కార్యక్రమంగా, మోడీ భజనగా మార్చివేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఈ తంతు. ఇలాంటి స్వార్ధపూరిత ప్రయత్నాలను కార్మికులు, రైతులు, కూలీలు, సాధారణ ప్రజానీకం అర్థం చేసుకుని ప్రతిఘటించాలి. కార్మికవర్గ, ప్రజల ఐక్యతను కాపాడాలి. ప్రజా సంపదను, సహజ వనరులను స్వదేశీ, విదేశీ దోపిడీదారులకు దోచిపెట్టకుండా ప్రతిఘటించాలి. మన దేశాన్ని రక్షించాలి. ప్రత్యామ్నాయ విధానాలను ప్రచారం చేస్తూ కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల కుటుంబాలను కలుసుకోవాలి. పని ప్రదేశాలు, నివాస ప్రాంతాల్లో వారి కుటుంబసభ్యులతో కలిసి విస్తృతంగా కరపత్రాల పంపిణీ చేయాలి. నయా ఉదారవాద విధానాల వినాశకర ప్రభావం గురించి, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ యొక్క మత విభజన కుతంత్రాలను కార్మికవర్గంలో ఎండగట్టాలి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని ఓడించేందుకు శ్రామిక ప్రజలను సమాయత్తం చేయాలి.
ఈ పరిస్థితుల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు, మతతత్వ ధోరణులకు
నిరసనగా ఫిబ్రవరి 16న జరుగుతున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లో రైతులు, వ్యవసాయ – కార్మికులు, కార్మికులు లక్షలాదిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాలు జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్,సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం),రైతు – వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇట్టి సభను బలోపేతం చేయడం జరిగింది