

కార్మిక సంఘాలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు.
భూపాలపల్లి ఏరియా స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 31: కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రత, సంస్థ అభివృద్ధే యాజమాన్యం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో శుక్రవారం అధికార గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ ప్రతినిధులతో స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ యూనియన్ ప్రతినిధులు ఉద్యోగుల సంక్షేమం, గనుల భద్రత, పని పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, వైద్య సేవలు, తాగునీటి సరఫరా, రవాణా, క్వార్టర్ల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించిన పలు సమస్యలు, సూచనలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. వివిధ విభాగాల అధికారులు యూనియన్ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై స్పందిస్తూ, పరిష్కారం సాధ్యమైన సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటామని, విధానపరమైన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయాలు తీసుకునేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, యాజమాన్యం–కార్మిక సంఘాల మధ్య పరస్పర అవగాహన, సమన్వయం, సహకారంతో పనిచేస్తే సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రత విషయంలో యాజమాన్యం ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏజీఎం (సివిల్) రవికుమార్, ఏజీఎం (ఐఈడీ) జ్యోతి, పీఓ కేటీకే ఓసీపీ-2 శ్యామ్ సుందర్, పీఓ కేటీకే ఓసీపీ-3 డి. రామస్వామి, కేటీకే-1 గ్రూప్ ఏజెంట్ ఎం. తిరుపతి, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్, ఏరియా విభాగాధిపతులు, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బి. మధుకర్ రెడ్డి, కార్మిక సంఘాల నాయకులు సుధాకర్ రెడ్డి, రాంచెందర్, రాజేందర్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.