అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.. నిర్లక్ష్యంపై కఠిన చర్యలు: కలెక్టర్ అంకిత్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
అశ్వారావుపేట, జూలై 1:
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణ, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలించారు. మొదటగా డాక్టర్లు, ఇతర సిబ్బంది హాజరు పట్టికలను తనిఖీ చేసిన కలెక్టర్, వారి విధుల నిర్వహణపై ఆరా తీశారు. సిబ్బంది ఎన్ని షిఫ్టుల్లో పనిచేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి వైద్య సేవల పరిస్థితిని పరిశీలించారు.
ప్రసూతి వార్డులో చికిత్స పొందుతున్న మహిళల సంఖ్య, వారికి అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్న కలెక్టర్, డయాలసిస్ వార్డును సందర్శించి రోగులకు మూడు షిఫ్టుల్లో సేవలు అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు. జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవల నాణ్యత, మందుల లభ్యత, వైద్యులు, సిబ్బంది స్పందనపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతో పాటు వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.