సీఎంపీఎఫ్‌ఓ బోర్డు కీలక నిర్ణయాలు: 2025–26కు 7.7% పీఎఫ్ వడ్డీ కొనసాగింపు.

సీఎంపీఎఫ్‌ఓ బోర్డు కీలక నిర్ణయాలు: 2025–26కు 7.7% పీఎఫ్ వడ్డీ కొనసాగింపు.
పెన్షన్, పీఎఫ్ సంస్కరణలకు ప్రాధాన్యం – ఉద్యోగుల డిమాండ్లపై సానుకూల స్పందన.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూలై 4:కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్‌ఓ) 186వ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల (బీఓటీ) సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సీఎంపీఎఫ్పై 7.7 శాతం వార్షిక వడ్డీ రేటును కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి బోర్డు చైర్మన్, బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్ గైర్హాజరులో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్ అధ్యక్షత వహించారు.ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేటును 7.6 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించినప్పటికీ, ఉద్యోగుల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై విస్తృత చర్చ అనంతరం ప్రస్తుతం అమలులో ఉన్న 7.7 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించింది. అదే సమయంలో పీఎఫ్, పెన్షన్ వ్యవస్థలో సమగ్ర సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో ఉద్యోగుల ప్రతినిధులు పలు కీలక డిమాండ్లను బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. సీఎంపీఎఫ్కు దీర్ఘకాలంగా చందాలు చెల్లించిన ఉద్యోగులకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని (నాన్-రిటర్నబుల్) ఉపసంహరణ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే బొగ్గు పరిశ్రమ నుంచి ఇతర ఉద్యోగాలకు వెళ్లిన ఉద్యోగులు తమ సీఎంపీఎఫ్ నిధులను సులభంగా ఉపసంహరించుకునే విధంగా నిబంధనలను సవరించాలని విజ్ఞప్తి చేశారు. పాక్షిక ఉపసంహరణ (పార్టియల్ విత్‌డ్రాయల్) విధానాన్ని సరళీకృతం చేయడంతో పాటు, పీఎఫ్, పెన్షన్ సమస్యల పరిష్కారానికి “సింగిల్ విండో” వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఉద్యోగుల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ అంశాలపై త్వరలో కార్యాచరణ చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. చెక్కుల క్లియరెన్స్ ఆలస్యం కారణంగా పీఎఫ్, పెన్షన్ సెటిల్మెంట్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీల నుంచి ఆలస్యాలపై సీఎంపీఎఫ్‌ఓ 12 శాతం వడ్డీ వసూలు చేస్తున్నప్పటికీ, ఉద్యోగులకు మాత్రం సకాలంలో చెల్లింపులు జరగకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. అలాగే సీఎంపీఎఫ్‌ఓ, బొగ్గు కంపెనీల మధ్య సేవా వివరాలు, చందా వివరాల్లో వ్యత్యాసాల వల్ల పీఎఫ్, పెన్షన్ క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను సమావేశపు మినిట్స్‌లో నమోదు చేయాలని కోరగా, భవిష్యత్తులో సీఎంపీఎఫ్‌ఓ, బొగ్గు కంపెనీలు క్రమం తప్పకుండా డేటా సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. సీ-డాక్ (C-DAC) సమీక్ష, సీఎంపీఎఫ్ చట్టాల సమగ్ర పరిశీలన, 1948 నాటి వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, సభ్యుల పాస్‌బుక్‌లను క్రమం తప్పకుండా నవీకరించడం, కోల్ మైన్స్ పెన్షన్ పథకం దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై అధ్యయనం వంటి అంశాలపై స్టాండింగ్ కమిటీ వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సమావేశం నిర్ణయించింది. ఉద్యోగం మారినప్పటికీ సభ్యుల పీఎఫ్ నిధులు సీఎంపీఎఫ్లోనే కొనసాగేందుకు అవసరమైన చర్యలపై కూడా చర్చించారు. ప్రస్తుతం సీఎంపీఎఫ్‌ఓ ఆధ్వర్యంలోని నిధుల పరిమాణం రూ.1.35 లక్షల కోట్లకు పైగా ఉందని సమావేశంలో వెల్లడించారు.
ఈ సమావేశంలో సీఎంపీఎఫ్ కమిషనర్ సంజీవ్ కుమార్, బొగ్గు మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన్ శుక్లా, జాయింట్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అసీమ్ కుమార్ మాజి, కోల్ ఇండియా డైరెక్టర్ (హెచ్ఆర్) వినయ్ రంజన్ (వర్చువల్), డైరెక్టర్ (ఫైనాన్స్) ముకేష్ కుమార్, కోల్ ఇండియా అనుబంధ సంస్థల సీఎండీలు (వర్చువల్), సింగరేణి ప్రతినిధులు, అలాగే కార్మిక సంఘాల ప్రతినిధులు రమేంద్ర కుమార్ (ఏఐటీయూసీ), రాకేష్ కుమార్ (హెచ్ఎంఎస్), డి.డి. రమణందన్ (సీఐటీయూ), కె. లక్ష్మారెడ్డి, ఆశిష్ మూర్తి (బీఎంఎస్), డి.ఎన్. సింగ్ (సీఎంఓఏఐ) పాల్గొన్నారు.
సీఎంపీఎఫ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడం, పీఎఫ్–పెన్షన్ క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యాలను తొలగించడం, ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన సేవలు అందించే దిశగా అవసరమైన సంస్కరణలను వేగవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది.