మాటలతో కాదు.. అగ్రిమెంట్లతో సమాధానం!
24 డిమాండ్ల సాధన నుంచి సింగరేణి పరిరక్షణ వరకు ఏఐటీయూసీ పోరాటం.
కార్మిక హక్కులపై రాజీ లేదు.. సింగరేణి ఆస్తులపై ప్రైవేటు కన్ను పడనివ్వం.
కొత్త బ్లాకులు సింగరేణికే.. లాభాల్లో 40 శాతం వాటా ఇవ్వాలి.
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, సెప్టెంబర్ 29:సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని ‘ఫేక్’ అని ప్రచారం చేస్తున్న వారు కార్మిక నాయకులు ఎలా అవుతారని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం కొత్తగూడెంలోని శేషగిరిభవన్‌లో కొత్తగూడెం, కార్పొరేట్ ఏరియాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి, సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం ఒక్కరోజు సమ్మెకు వెళ్లకుండానే 24 డిమాండ్లపై లేబర్ కమిషనర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నామని రాజ్ కుమార్ తెలిపారు. కార్మికుల ప్రయోజనాలకు సంబంధించిన చట్టబద్ధమైన ఒప్పందంపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. గతంలో టీబీజీకేఎస్ పదకొండేళ్ల కాలంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు, ఏఐటీయూసీ గత రెండేళ్లలో సాధించిన ఒప్పంద పత్రాలను తీసుకుని సింగరేణిలో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ఏఐటీయూసీ చేసిన ఒప్పందానికి సంబంధించిన సర్క్యులర్లను సింగరేణి యాజమాన్యం వెంటనే జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు దుష్ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అప్పటి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ విధానాల కారణంగా లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు చెందిన కోట్లాది రూపాయలను ప్రభుత్వ పథకాలకు వినియోగించి సంస్థ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారని రాజ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో అధికారంలోకి వచ్చిన టీబీజీకేఎస్ 2012 నుంచి 2023 వరకు పదకొండేళ్లపాటు గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో కార్మికులకు ఏ హక్కులు సాధించిందో చెప్పాలని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు, విద్యుత్‌ను వినియోగించుకుని రూ.26 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా సంస్థను అప్పుల భారంలోకి నెట్టారని ఆయన ఆరోపించారు. అదే సమయంలో సంస్థకు రావాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలు వసూలు కాకపోవడంతో కొత్త యంత్రాలు, పనిముట్లు, భద్రతా సామగ్రి కొనుగోలుపై ప్రభావం పడుతోందన్నారు. అవసరమైన పరికరాలు, భద్రతా సామగ్రి అందుబాటులో లేకుండా కార్మికులు బొగ్గు ఉత్పత్తి ఎలా చేయగలరని ప్రశ్నించారు. సింగరేణి మనుగడ దీర్ఘకాలం కొనసాగాలంటే కొత్త గనులు ప్రారంభం కావాల్సిన అవసరం ఉందని రాజ్ కుమార్ అన్నారు. యాజమాన్యం గుర్తించిన శ్రావణపల్లి, సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్‌కాస్ట్ కొత్త బ్లాకులను టెండర్ ప్రక్రియ ద్వారా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. సంస్థ ఆస్తులపై ప్రైవేటు సంస్థల ఆధిపత్యానికి అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల కారణంగా 12వ వేజ్ బోర్డు ప్రక్రియ ప్రారంభం ఆలస్యం అవుతోందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి వేజ్ బోర్డు పరిష్కారం చేస్తామని చెబుతున్నప్పటికీ జాతీయ కార్మిక సంఘాలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. లేబర్ కోడ్‌లతో సంబంధం లేకుండా గత విధానంలోనే 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. దీపావళి బోనస్‌ను పెంచాలని, దసరా పండుగకు ముందే సింగరేణి లాభాల్లో కార్మికులకు 40 శాతం వాటా చెల్లించాలని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిస్తే రెండేళ్ల కాలపరిమితి, ఇతర సంఘాలు గెలిస్తే నాలుగేళ్ల కాలపరిమితి ఉండే విధానంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. కార్మికుల హక్కుల సాధనలో ఏఐటీయూసీ రాజీ పడబోదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శులు ఎస్.వి. రమణమూర్తి, జక్కుల గట్టయ్య, ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్, కత్తెర్ల రాములు, సహాయ కార్యదర్శి రాము, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, హుమాయూన్, నాగయ్య, నితిన్, పిట్ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్, అనంతలక్ష్మి, నరేష్, రమేష్, మల్లికార్జున్, సత్తుపల్లి మైనింగ్ స్టాఫ్ కార్యదర్శి ఎల్. సుశీల్ కుమార్, నాయకులు బండారి మల్లయ్య, మండల రాజేశ్వరరావు, సురేందర్, మురళి, సోమయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.