తగిన జాగ్రత్తలతో లాభసాటిగా పశు పోషణ
– పశుసంవర్ధక శాఖ ఏడీ గంగాధరయ్య

కమ్మర్పల్లి, ఆగస్టు 17 ( లోకంతీరు ) : మహిళా సంఘాల ద్వారా రుణాలు పొంది పాడి పశువులను కొనుగోలు చేసే రైతులు తగిన జాగ్రత్తలు పాటించి పశు పోషణ ను లాభసాటిగా చేపట్టాలని పశుసంవర్ధక శాఖ ఏడి గంగాధరయ్య పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు శనివారం స్థానిక ఐకెపి కార్యాలయంలో ఐకెపి మరియు పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన పాడి రైతుల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా పాడి రైతులకు గేదెలు ఆవులకు మరియు కోళ్ల పెంపకం దారులకు రుణాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడమైందని వివరించారు. ఇందులో భాగంగా పాడి పశువులను మరియు కోళ్లను కొనుగోలు చేసే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని తర్వాత కూడా సకాలంలో వైద్య సేవలను పొంది నాణ్యమైన మేతను పశువులకు అందిస్తే ఆశించిన రీతిలో వ్యాపారం లాభసాటిగా జరుగుతుందని వివరించారు.
పశువులను పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలని రైతుల ఇష్టం మేరకే ఇతర రాష్ట్రాలలోని నచ్చిన చోట కొనుగోలు చేయవచ్చని తెలిపారు. అయితే కొనుగోలు చేసే సమయంలో పశువుల యొక్క నాణ్యతను పరిశీలించి ఆరోగ్యవంతమైన పశువులను మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు.కమ్మర్పల్లి మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ రైతులు పశుగ్రాసం కోసం స్థలాన్ని కేటాయించి పశుగ్రాసం సాగు చేయాలని తద్వారా పాడిపశువుల ఆరోగ్యం బాగుంటుందని వివరించారు.వైద్య సేవలు అవసరమైన వారు ఎప్పుడైనా తమను నేరుగా సంప్రదించవచ్చని సకాలంలో పశువులకు వైద్యం పొంది పశుపోషణ లాభసాటిగా నిర్వహించుకోవాలని సూచించారు.
ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్ మాట్లాడుతూ కమ్మర్పల్లి మండలంలోని మహిళా సంఘ సభ్యులకు ఎలాంటి వ్యాపారం చేపట్టినా ఒక్కో సభ్యురాలికి ఐదు లక్షలకు మించి కూడా రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ రుణాలను పాడి పశువులు కోళ్ల పెంపకం వంటి కార్యక్రమాలకు సద్వినియోగం చేసుకొని ఆదాయవృద్ధి పెంపొందించుకోవాలని అన్నారు.పశువుల కొనుగోలు అనంతరం ఆహార శుద్ధి కార్యక్రమాల కింద 35% సబ్సిడీతో 10 లక్షల సబ్సిడీ వరకు రుణాలు అందించే అవకాశం ఉందని దానిని కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా జాతీయ లైఫ్ స్టాక్ మిషన్ కింద కూడా 50% వరకు పౌల్ట్రీ , మేకలు గొర్రెల పెంపకం దారులకు పెద్ద ఎత్తున సబ్సిడీ కార్యక్రమాలు ఉన్నాయని పెంపకం దారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మోర్తాడు పశు వైద్యాధికారి డాక్టర్ గౌతమ్ రాజ్ పలు విలువైన సూచనలు చేశారు. సీసీలు భలేరావు రవికుమార్ వర్ణం శ్రీనివాస్, అలేఖ్య సిబ్బంది ధనలక్ష్మి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన రైతులు పాల్గొన్నారు.